శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (15:48 IST)

నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థత - ఆరోగ్యం విషమం???

tarakaratna
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. కుప్పంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోలు బాలకృష్ణ, తారకరత్నలు పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా నటుడు తారకరత్న తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. 
 
తారకరత్న ఆరోగ్యంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అందువల్లే స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు చెప్పారని వివరించారు. ప్రస్తుతానికి తారకరత్నకు యాంజియోగ్రామ్ చేశారని, స్టెంట్లు వేయలేదని స్పష్టం చేశారు. అవసరమైతే హెలికాప్టర్‌లో బెంగళూరు తరలిస్తామని గోరంట్ల పేర్కొన్నారు. 

మరోవైపు, తారకరత్న ఆరోగ్యంపై ఆయనకు చికిత్స అందించిన వైద్యులు స్పందిస్తూ, తారకరత్నను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి పల్స్ పూర్తిగా పడిపోయాయని చెప్పారు. శరీరం రంగు కూడా నీలంగా మారిపోయిందన్నారు. వెంటనే చికిత్స ప్రారంభించడంతో 45 నిమిషాల తర్వాత పల్స్ అందిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మెల్లగా కోలుకుంటున్నారని చెప్పారు. అయితే, మరింత మెరుగైన ఆరోగ్యం కోసం బెంగుళూరు తరలించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.