ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 10 జూన్ 2024 (17:04 IST)

హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావు హీరోగా వైవిఎస్ చౌదరి చిత్రం ప్రకటన

YVS Chaudhary, Yalamanchili Gita
YVS Chaudhary, Yalamanchili Gita
తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని "న్యూ టాలెంట్ రోర్స్ @" బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. రమేష్ అత్తిలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 
నందమూరి తారక రామారావు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకొని, హీరోగా ఎదగడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్చుకున్నారు. తన అద్భుతమైన కెరీర్‌లో ఎందరో నటీనటులను పరిచయం చేసిన వైవిఎస్ చౌదరి తన కమ్‌బ్యాక్ మూవీతో నందమూరి తారక రామారావును లాంచ్ చేసే బాధ్యతను తీసుకున్నారు.
 
డైరెక్టర్ వైవిఎస్ చౌదరికి నందమూరి హీరోలతో గొప్ప అనుబంధం వుంది. ఆయన హరికృష్ణ, బాలకృష్ణతో సినిమాలు చేశారు. ఇప్పుడు నందమూరి తారక రామారావుని పరిచయం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. 
 
అనౌన్స్ మెంట్ ఈవెంట్ లో డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. సభకు నమస్కారం. ఈ రోజు మీ అందరిముందు నిల్చోగలిగానంటే అది నా దైవంగా భావించే నందమూరి తారకరామారావు గారి దివ్య మోహన రూపం చలువ. ఆయన దివ్య మోహన రూపం నన్ను సినిమాల వైపు నడిపించింది. పరిశ్రమలోకి వచ్చిన తర్వాత అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, కో డైరెక్టర్ గా, డైరెక్టర్, నిర్మాతగా ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్ని శాఖలు నిర్వహించిన కూడా ఇప్పటికీ నేను ఎన్టీఆర్ వీర అభిమానిని అని చెప్పుకోవడంలో నాకు ఆనందం వుంటుంది. 
 
అంకితభావంతో నమ్మిన సిద్దాంతం కోసం కష్టపడి పని చేస్తే కన్నకలలు సాకారం అవుతాయనే ఎన్టీఆర్ గారి సిద్ధాంతాన్ని ఆచరించి ప్రపంచం వ్యాప్తంగా ఏందరో వున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నేను సంపాదించిన పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు కూడా ఆయన సిద్ధాంతాలనే పెట్టుబడిగా పెట్టి పరిశ్రమలోకి వచ్చాను. అక్కినేని నాగార్జున గారు దర్శకుడిగా నాకు తొలి అవకాశం ఇచ్చారు. హీరో గా ఎవరు కావాలని ఆయన అడిగినప్పుడు కొత్తవారిని పరిచయం చేద్దామని అనుకుంటున్నానని చెప్పాను. ఆ సమయంలో కొత్త వారితో సినిమాలు చేసే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ఆయన ఎలాంటి సంకోచం లేకుండా కొత్తవారిని పరిచయం చేస్తూ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా నాకు తొలి అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి రుణపడి వుంటాను. 
 
చదువుకునే రోజుల్లోనే రామారావు గారి అభిమాని నుంచి ఎన్టీఆర్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పదవి ఇదని భావించాను. ఆ సమయంలో విడుదలైన వేటగాడు సినిమా చూసి దర్శకుడు రాఘవేంద్రరావు గారికి కూడా వీర అభిమాని అయ్యాను. తదనంతరం రామారావు గారి అబ్బాయి హరికృష్ణ గారు కృష్ణావతారం సినిమాలో చిన్న కృష్ణుని గా నటించారు. తదనంతరం బాలకృష్ణ గారు తాతమ్మ కల సినిమాలో అరంగేట్రం చేశారు. రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారిని ఫాలో చేసుకోవాలని అభిమానాల సంఘాలుగా మేమంతా అనుకున్న సమయంలో బాలకృష్ణ గారు ఓ యువ కెరటంలా కనిపించారు. గుడివాడ లో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోషియేన్ మొట్టమొదటిగా స్టార్ట్ చేశాం. తదనంతరం బాలకృష్ణ గారి పట్టాభిషేకం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేరే అవకాశం రావడం ఓ అదృష్టం. నేను ఎదిగిన క్రమంలో నందమూరి బాలకృష్ణ గారితో, హరికృష్ణ గారితో, మహేష్ బాబు గారితో, నాగార్జున గారితో సినిమాలు చేయడంతో పాటు నందమూరి, అక్కినేని హీరోలతో కలసి ఒక కాంబినేషన్ చేయడం, తొలి సినిమాకే నాగేశ్వరరావు గారితో పని చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టం. 
 
ఎంతోమంది కొత్తవారి పరిచయం చేస్తూ సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేయడం జరిగింది. 'దేవదాస్' తో అఖండ విజయం సాధించడం, సాయి ధరమ్ తేజ్ ని పరిచయం చేయడం.. ఇలా కొత్తవారిని పరిచయం చేయడానికి కేరాఫ్ అడ్రస్ అనే పేరొచ్చింది. తర్వాత ఎవరితో సినిమా చేయాలని అలోచించినప్పుడు న్యూ టాలెంట్ రోర్స్ @ బ్యానర్ ని స్థాపించడం, యాద్రుచ్చికంగా బ్యాంకర్ కి NTR పేరు కలిసి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి కొత్త ప్రతిభగా ఎవరిని ఎన్నుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు.. తమ్ముల ప్రసన్న కుమార్ గారు ఓ వ్యక్తిని చూపించారు. ఆయన ఎవరో కాదు.. మా దైవం నందమూరి తారకరామారావు గారి ముని మనవడు, మా కథానాయకుడు హరికృష్ణ గారి మనవడు, నందమూరి జానకి రామ్ గారి పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావు. నందమూరి నాలుగో తరాన్ని పరిచయం చేసే అవకాశం రావడం నాకు దక్కిన గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. తన కుమారుడు పుట్టినప్పుడే ఓ కలకని కుమారుడికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారు. ఆ కలని సాకారం చేసుకునే తపన నందమూరి తారక రామారావులో వుంది. తను అద్భుతంగా వున్నాడు. మంచి రూపం. చాలా బావుంటాడు. మంచి నడవడిక వుంది. తనని చూసినప్పుడు ఎన్టీఆర్ పేరుని నాలుగో తరం కొనసాగించేందుకు దేవుడు ప్రక్రుతి శాసిస్తుందని అనిపించింది. అభిమానులకు ఓ ఆనందకరమైన వార్తలా ఫీలయ్యాను. తనకి తపన, దీక్ష పట్టుదల వున్నాయి. జానకి రామ్ కన్న కలని నడిపించడానికి వచ్చిన మధ్యామాన్ని నేను అని భావిస్తున్నాను. 
 
మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. నందమూరి తారకరామారావు అనే నాలుగో తరం పేరుని ప్రపంచానికి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా యువరత్న బాలకృష్ణ గారి బర్త్ డే రోజున ఈ విశేషాన్ని ప్రకటించడం మా అదృష్టం. ఇందులో తెలుగు అమ్మాయిని కథానాయికగా పరిచయం చేస్తున్నాం. తను అద్భుతంగా వుంటుంది. త్వరలోనే ఆమెను కూడా పరిచయం చేస్తాం. నా సినిమా ప్రతి సినిమాకి సంగీతం, సాహిత్యానికి పెద్దపీట వేస్తాను. ఈ సినిమా కూడా సంగీతం, సాహిత్యానికి చాలా ప్రాముఖ్యత వుంటుంది. మంచి వేడుకలో వారిని కూడా పరిచయం చేయడం జరుగుతుంది. వారి నాలెడ్జ్ ఈ సినిమా కొండంత అండగా ఉంటుందని భావిస్తున్నాను' అన్నారు. 
 
నిర్మాత యలమంచిలి గీత మాట్లాడుతూ.. మా స్నేహితులు సన్నిహితులు అందరిఅండదండలతో న్యూ టాలెంట్ రోర్స్ @ ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. మీ అందరి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం'' అన్నారు.   
 
నందమూరి తారక రామారావు ను అద్భుతంగా ప్రజెంట్ చేసే విధంగా వైవిఎస్ చౌదరి కథ, స్క్రీన్‌ప్లే రాశారు. ఖచ్చితంగా, ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. సినిమా జానర్, హీరోయిన్, ఇతర కీలక అంశాలకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తారు.