కొవిడ్ కష్టకాలంలో బాసటగా నిలుస్తోన్న హోంబలే ఫిలింస్
ప్రభాస్‌తో `సలార్` సినిమా నిర్మిస్తోన్న హోంబలే ఫిలింస్ రెండు కోట్లతో కోవిడ్ బాధితులను ఆదుకుంటోంది. అదెలాగంటే, కరోనా బారిన పడిన వారు హాస్పిటల్స్‌లో బెడ్స్ అందుబాటులో లేకుండా, ఆక్సిజన్ అందక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ పాండమిక్ సమయంలో సినీ రంగం కూడా కష్ట నష్టాలను భరిస్తోంది. సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఆగిపోయాయి. ముఖ్యంగా సినీ కార్మికులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది మనందరికీ పరీక్షా సమయం..ఇలాంటి సమయంలో మనం అందరం ఒకరికొకరు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఆలోచనతో సినీ కార్మికులకు అండగా నిలబడటానికి ముందడుగు వేసింది ఇండియాలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన హోంబలే ఫిలింస్.
హోంబలే సంస్థ...రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్స్, 20 ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేసింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖల్లోని 3200 మంది సభ్యులకు రూ.35 లక్షలను సాయాన్ని అందించింది హోంబలే నిర్మాణ సంస్థ. అంతే కాకుండా హోంబలే నిర్మాణ సంస్థలో రూపొందుతోన్న సలార్ సినిమా కేవలం పది రోజుల చిత్రీకరణను మాత్రమే పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఆ సినిమా కోసం పని చేస్తున్న 150 మంది యూనిట్ సభ్యుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. గత ఏడాది పాండిమిక్ సమయంలోనూ 350 మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.5000 వేల ఆర్థిక సాయాన్ని రెండు నెలల పాటు అందించి బాసటగా నిలిచింది హోంబలే నిర్మాణ సంస్థ.