గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 31 జులై 2023 (10:46 IST)

నా మేనళ్లుల్లు, మిత్రులు విజయాలు పొందుతుంటే సంతోషపడుతున్నా : మెగాస్టార్ చిరంజీవి

Chiru with baby team
Chiru with baby team
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బేబీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్ ఆదివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరోలు ఆనంద్  దేవరకొండ, విరాజ్ అశ్విన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేష్, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ కు షీల్డ్స్ అందించి విశెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.
 
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - నేను బేబి సినిమా విజయోత్సవ సభకు వచ్చానా లేక నా సన్మాన సభకు వచ్చానా అర్థం కావడం లేదు. నన్ను అభిమానిస్తూ, ప్రేమిస్తూ వాళ్ల మనసులో మాటను నాకు చెబుతున్న నా అభిమానులందరికీ నా ధన్యవాదాలు చెబుతున్నా. పుత్రోత్సాహం ఎలా ఉంటుందో అనుభవిస్తున్నాను, అలాగే తమ్ముళ్ల అభివృద్ధిని చూసి ఆనందిస్తున్నాను. అలాగే నా మేనళ్లుల్లు, మిత్రులు నాతో పాటు ఎదుగుతూ విజయాలు పొందుతుంటే సంతోషపడుతున్న నాకు..దేవుడు ఇచ్చిన తమ్ముళ్లైన  అభిమానులు..నన్ను స్ఫూర్తిగా తీసుకుని... మనం కూడా సాధించవచ్చు అని తమకంటూ ఒక  మార్కు చూపిస్తూ ,సక్సెస్ అందుకుంటుంటే ఎంతో హ్యాపీగా ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహారణ ఈ బేబీ ఫంక్షన్. 
 
ఎస్కేఎన్ సాయిరాజేష్ ఎప్పటినుంచో తెలుసు. వాళ్లను నేను తరుచూ కలవకున్నా వాళ్లు చేసే సినిమా ప్రయత్నాల గురించి వింటూనే ఉంటాను. అభిమానులు అంటే థియేటర్ లో సినిమా చూసే దగ్గరే ఆగిపోవడం కాదు..ఇలా మమ్మల్ని, మా సినిమాల్ని చూసి పొందిన స్పూర్తి ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చా ఇలా తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ విజయాలు సాధిస్తున్నారంటే అందుకు నాకంటే సంతోషించేవారు ఉండరు. 
 
హీరోల అభిమానులంటే ఒక లక్ష్యం లేకుండా తిరుగుతారు, చదువుల మీద శ్రద్ధ  పెట్టరు. మరో హీరో అభిమానులతో గొడవలు పడతారు అనే రోజుల నుంచీ నాకు తెలుసు. అవి నా చెవిన పడిన సందర్భాలూ ఉన్నాయి. అప్పుడే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సామాజిక  కార్యక్రమాలు చేపట్టి నా అభిమానులంటే సమాజం గర్వించేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. మారుతి, సాయిరాజేష్, ఎస్కేఎన్ వంటి నా  ఫ్యాన్స్ కలిసి చేసిన సినిమా ఘన విజయం సాధించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. వాళ్ల సంతోషంలో నేనూ ఒక భాగమవ్వాలని ఈ కార్యక్రమానికి వచ్చాను. మారుతి సాఫ్ట్ వేర్ కంపెనీకి పనిచేస్తుంటే..ఒక రోజు ఒక పాట ఆడియో ఇచ్చి దీనికి విజువల్స్ తీసుకుని రా అని చెప్పాను. అతను వెళ్లి మంచి విజువల్స్ తెచ్చాడు. అప్పుడే అనిపించింది ఇతనిలో డైరెక్టర్ ఉన్నాడని, ఆ మాటే మారుతికి చెప్పాను. నా మాట నమ్మాడు. ఇవాళ పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేసే దర్శకుడు అయ్యాడు. ఎస్కేఎన్ ఏలూరులో నా సినిమా బ్యానర్స్ కట్టే అభిమాని టైమ్ నుంచి తెలుసు. గీతా ఆర్ట్స్ లో అరవింద్ గారు, బన్నీ సపోర్ట్ తో ప్రొడక్షన్ విషయాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఈరోజుల్లో, టాక్సీవాలా..ఇప్పుడు బేబి మూవీ ప్రొడ్యూస్ చేశాడు. నా అభిమానిగా అతని ఎదుగుదల చూస్తుంటే గర్వంగా ఉంది. ఇవాళ ఎస్కేఎన్ ఎంతోమందికి ఇన్సిపిరేషన్ గా నిలిచాడు. అతని స్పీచ్ లు కూడా ఈ మధ్య కొన్ని విన్నాను. సాయి రాజేష్ మొదట్లో స్పూ‌ఫ్ సినిమాలు చేశాడు. కలర్ ఫొటోతో కథా రచయితగా తన సత్తాచాటాడు. జాతీయ అవార్డ్ గెల్చుకున్నాడు. 
 
ఇవాళ బేబి మూవీతో ఒక కాంటెంపరరీ మూవీ చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. అతను నా అభిమాని  కావడం గర్వంగా ఉంది. ఇండస్ట్రీలోకి కొత్త తరం రావాలి, కొత్త ఆలోచనలు కావాలి. అప్పుడే ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. రాజమౌళి లాంటి దర్శకులు ఉన్నారు కాబట్టే ఆస్కార్ వరకు తెలుసు సినిమాలు వెళ్లగలుగుతున్నాయి. కొత్త దర్శకులు ఇండస్ట్రీ అభివృద్ధిలో భాగమైతే...అదే మీరు చేసే ప్రత్యుపకారం అనుకోవాలి. ఆనంద్ గతంలో చేసిన ఒక సినిమా చూశాను. ఇప్పుడు బేబి చూస్తుంటే నటుడిగా ఆనంద్ ఎంతో పరిణితి చెందాడని అనిపించింది. బస్తీ కుర్రాడిగా సహజంగా నటిస్తూ వచ్చాడు. ఒక సీన్ లో అతను పలికించిన భావోద్వేగాలు చూసి ఇంత బాగా ఆనంద్ నటించగలడా వావ్ అనిపించింది. ఆనంద్ లో ఒక మంచి యాక్టర్ ఉన్నాడు. ప్రతి సీన్ అతను ఫీల్ అయి చేస్తాడు. ఆ ఫీల్ మనకు అతని ఫేస్ లో కనిపిస్తుంటుంది. బేబి క్యారెక్టర్ లో ఆనంద్ నటనను కాదు హృదయాన్ని చూశాను. విరాజ్, అశ్విన్ చక్కగా నటించారు. లవ్ స్టోరిస్ చాలా చూస్తుంటాం. కానీ ఈ సినిమాలో అందరూ మంచి వాళ్లే. విలన్ లేకుండా ఇంతబాగా చూపించగలిగారు అంటే సర్ ప్రైజ్ అయ్యాను. వైష్ణవి మానసిక సంఘర్షణ ఆకట్టుకునేలా చూపించారు. ఆ స్ట్రగుల్ సినిమాను నిలబెట్టింది. బస్తీలో అమాయకపు అమ్మాయిగా కాలేజ్ లో ట్రెండీ మేకోవర్ లోకి మారే యువతిగా వైష్ణవి పర్మార్మెన్స్ ఆకట్టుకుంది. సినిమా చూస్తున్నంత సేపూ చాలాసార్లు వైష్ణవి ఎంత మెచ్యూర్డ్ గా నటించింది అనిపించింది. విరాజ్ మన సినిమా ఫ్యామిలీ కుర్రాడే. ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చాడు అనిపించింది. మనం ఎంత కష్టపడితే అంత గొప్పగా మనల్ని నిలబెట్టే పరిశ్రమ ఇదే. విరాజ్ చాలా అందంగా కనిపించాడు. విరాజ్ అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేస్తాడని అనుకుంటాం కానీ అతను నిజంగా ప్రేమించాడు. ఈ స్క్రిప్ట్ లోని గొప్పదనం అదే. అందరూ మంచి వాళ్లే.  నిజమైన ప్రేమికుడిగా ఉండి అమ్మాయి ప్రేమ కోసం తపిస్తుంటాడు. 
 
ఇది ఎడ్యుకేట్ చేసే సినిమా. మీరు వదిలినా మిమ్మల్ని ఈ కంటెంట్ వదలదు. రెండు మూడు రోజులు నేను ఈ సినిమా మూడ్ లోనే ఉండిపోయాను. ఇవాళ చాలా మంది యువత సోషల్ మీడియా మాయలో పడిపోయి, ఎడిక్ట్ అయిపోతున్నారు. టెక్నాలజీకి కట్టుబడి పోతున్నారు. ఎక్కడో ఒక బలహీనమైన సమయంలో మాటో, తప్పు పనో చేస్తుంటారు. ఆ తప్పుల్ని క్యాప్చర్ చేసి బ్లాక్ మెయిలింగ్స్ జరుగుతున్నాయి. ఆ తప్పులతో యువత సూసైడ్ దాకా వెళ్తున్నారు. అందుకే పెద్దలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అందుకే టెక్నాలజీని మంచికే వాడుకోవాలని కోరుతున్నా. జీవితంలో తెలిసో తెలియకో ఒక తప్పుచేసినా బాధపడుతూ కూర్చోకుండా ఒక మంచి లైఫ్ ఉంటుందనే ఆశతో బతకాలనే గొప్ప సందేశాన్ని సాయిరాజేష్ ఈ సినిమాతో ఇచ్చాడు. అన్నారు