కష్టపడిపైకొచ్చిన హీరోలే నాకు స్ఫూర్తి: నిరోజ్ పుచ్చా
Niroj Puchcha, Ramanamurthy
జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, గోపీచంద్ .. వీళ్లే తన రోల్స్ మోడల్స్ అంటున్నారు భారతీయన్స్ చిత్ర హీరో నిరోజ్ పుచ్చా. టెన్నిస్ క్రీడాకారుడైన నిరోజ్ కొందరు మిత్రుల ప్రోద్భలంవల్ల నటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. జాతీయ స్థాయిలో కూడా తన కుమారుడు టెన్నిస్ ఆడారని నిరోజ్ తండ్రి పుచ్చా రమణమూర్తి తెలిపారు. సినిమారంగంలోకి రావాలన్న కోరిక తనకు కూడా ఉండేదని, ఆ కోరికతోనే తను చెన్నై వెళ్లి ఫిలిం ఇన్స్ స్టిట్యూట్ లో చేరే ప్రయత్నం చేశానన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తనకు సీనియర్ అని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల తన ప్రయత్నాలు మానుకుని వెనక్కి వచ్చేశానని తెలిపారు. ఇప్పుడు తన కుమారుడు ఆ రంగంపై ఆసక్తి చూపడంతో ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.
నిరోజ్ పుచ్చా మాట్లాడుతూ ఇష్టపడి తను ఈ రంగంలోకి వచ్చానని, కష్టపడితే వారిలానే ఎదగవచ్చన్న నమ్మకంతోనే తను సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టానని చెప్పారు. మంచి అవకాశం వస్తే హీరోగానే కాదు విలన్ గా అయినా తనేమిటో నిరూపించుకుంటానన్నారు. భారతీయన్స్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలో మొదటగా అవకాశం రావడం తన అదృష్టమన్నారు. షార్ట్ ఫిలింతో నటుడిగా తన కెరీర్ ప్రారంభమైన తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయన్నారు. మొదట్లో బిజినెస్ మీద దృష్టి పెట్టి మిస్టర్ పులావ్ పేరుతో ఫ్రాంచైజీ బిజినెస్ నెలకొల్పినట్టు తెలిపారు. ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా తన తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తను నటుడిగా ఎదగడానికి తోడ్పడిందన్నారు. ముఖ్యంగా దర్శకుడు దీనరాజ్ భారతీయన్స్ సినిమాలో తనను ఎంపిక చేయడం, ఎంతో కష్టపడి ఆ పాత్ర చేయడం తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడిందన్నారు. తన సినిమా అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
- మిస్టర్ పులావ్ ఔట్ లెట్స్ తో వ్యాపార రంగంలో వైజాగ్ లో మొదట ప్రారంభించాను. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఫ్రాంచైజీల రూపంలో విస్తరించాను. దీనివల్ల నాకో గ్రూప్ ఏర్పడింది. అందులో ఉండే నవీన్ వర్మ అనే వ్యక్తి నుంచి సినిమా ప్రతిపాదన వచ్చింది. నీ స్క్రీన్ ప్రెజన్స్ చాలా బాగుంటుంది. మనం కలిసి సినిమా చేద్దాం అన్నాడు. అలా 2019లో నా జర్నీ షార్ట్ ఫిలింతో ప్రారంభమైంది. సారథి స్టూడియోలోనే ఆ షూటింగ్ చేశాం. దానివల్ల చాలా నేర్చుకోగలిగాను. నవీన్ అనే అతను ఆ అవకాశం ఇవ్వకపోతే నేనీరోజు ఇక్కడ ఉండకపోయేవాడినేమో. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశాను. అక్కడి నుంచి భారతీయన్స్ వరకు నా జర్నీ కొనసాగింది.
నాకు యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం.హీరోగానే యాక్ట్ చేయాలి అని ఏ రోజూ అనుకోలేదు. గోపీచంద్ గారు వచ్చింది హీరోగానే. కానీ ఆయనకు గుర్తింపు తెచ్చినవి నెగిటివ్ పాత్రలే. వర్షం, నిజంలో చేసిన విలన్ పాత్రలు ఎంత గుర్తింపు తెచ్చాయో మీకు తెలుసు. ఆ తర్వాత మళ్లీ హీరో అయ్యారు. అందుకే నటుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలన్నదే నా కోరిక. నన్ను నేను ప్రూవ్ చేసుకోగలగాలి. దాని తర్వాతే ఏదైనా.
- నాకు విలన్ షేడ్ క్యారెక్టర్లు అంటే ఇష్టం. రావణలో ఎన్టీఆర్ లాంటి పాత్రలు, నిజం, వర్షం లాంటి చిత్రాల్లో గోపీచంద్ లాంటివారు చేసిన పాత్రలు, వారియర్ లో ఆది పినిశెట్టి పాత్ర ఇష్టం. ఇలాంటివాటిలో కొంచెం పవర్ అనేది కనిపిస్తుంటుంది. అందుకే అలాంటి పాత్రలు చేయాలని ఉంది. అందరూ పెద్ద దిగ్గజాలే. వారితో నటించాలంటే మనలో కూడా ఆ సత్తా ఉండాలి.. ఉందని నేననుకుంటున్నాను.
- తెలుగులో త్రివిక్రమ్, బోయపాటి శ్రీను లాంటి వాళ్లు చాలా ఇష్టం. వీళ్ల సినిమాలు విభిన్నంగా ఉంటాయి. రాజమౌళి గారు అందరికీ ఫేవరేట్ డైరెక్టరే. ఆయన సినిమాలు అద్భుతంగా ఉంటాయి.