రామ్ చరణ్ RC 16లో నా లుక్ నాకెంతో సంతృప్తి కలిగింది: జగపతి బాబు
buchibabu explains sean to Jagapathi Babu
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కలయికలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. RC16గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్, విలక్షణ నటుడు జగపతిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచుతూ జగపతిబాబు ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. తన పాత్రకు సంబంధించి బిహైండ్ ది సీన్ వీడియోను ఆయన షేర్ చేశారు. అంకిత భావంతో తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయే నటుడిగా జగపతిబాబుకి పెట్టింది పేరు.
జగపతిబాబు షేర్ చేసిన వీడియో ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ చాలా కాలం తర్వాత RC 16కోసం బుచ్చిబాబు సానా చాలా మంచి పాత్రనిచ్చారు. ఈ సినిమాలో నా లుక్ చూసి నాకెంతో సంతృప్తి కలిగింది అన్నారు. తాజాగా ఈ వెర్సటైల్ యాక్టర్ సినిమాలో తన లుక్ గురించి చేసిన వ్యాఖ్యలతో అందరిలో మరింత ఆసక్తి, అంచనాలు పెరిగాయి. జగపతిబాబు ఇప్పటి వరకు చూడనటువంటి సరికొత్త అవతార్‌లో మనకు కనిపించబోతున్నారు.
ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీని, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్ల వర్క్ చేస్తున్నారు. సరికొత్త కథ, కథనాలతో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా RC 16ను రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్, నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.