గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (19:48 IST)

డార్క్ కామెడీ, సైకో పాత్రంటే ఇష్టంః ఫారియా అబ్దుల్లా

Faria Abdullah
స్టేజీ న‌టన నుంచి సినిమా రంగంలోకి ప్ర‌వేశించిన న‌టి ఫారియా అబ్దుల్లా. `జాతిరత్నాలు’ సినిమాతో నాయికగా పరిచయమవుతోంది. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్‌ తెరకెక్కించిన చిత్రమిది. మార్చి 11న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఫారియా విలేకర్లతో మాట్లాడారు.
-  నా స్వస్థలం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌. కానీ, తెలుగులో మాట్లాడే అవ‌స‌రం పెద్ద‌గా రాలేదు. అందుకే తెలుగు నేర్చుకోలేదు. ఇప్పుడు సినిమా కోసం అవ‌స‌రం వ‌చ్చింది.  సినిమా కోసం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా.
- నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. పెయింటింగ్‌, సంగీతం, నృత్యం అన్నింటినీ ప్రయత్నించాను. డ్యాన్సర్‌ కావాలనుకున్నాను. కానీ నటనవైపు వెళ్లడంతో ఆ కల అలానే ఉండిపోయింది. మోడలింగ్‌ కూడా చేశాను. 
- ప‌లు థియేట‌ర్ షోలో ప‌లువురు ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర దాదాపు ఏడేళ్లు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పని చేశాను. 50 స్టేజ్‌ షోల్లో పాల్గొన్నాను. ఆ త‌ర్వాత‌‘నక్షత్ర’ అనే వెబ్‌ సిరీస్‌తో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. అప్పుడే కెమెరా ముందు ఎలా న‌టించాలో తెలిసింది.
 
- హైదరాబాద్‌లోని లయోలా కాలేజీలో చదువుతున్న రోజుల్లో దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ఓ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ కార్యక్రమంలో నేను స్పీచ్‌ ఇచ్చాను. అది చూసిన అశ్విన్‌ నన్ను కలిసి ఏమవ్వాలనుకుంటున్నావ్‌? అని అడిగారు. నేను థియేటర్‌ ఆర్టిస్ట్‌ని, నటి కావాలనుకుంటున్నా అని చెప్పాను. ఆ తర్వాత ఇన్‌ట్రాగ్రామ్ ద్వారా న‌న్ను ఆడిష‌న్‌కు ర‌మ్మ‌ని ఆహ్వానించారు. అలా జాతిర‌త్నాలు సినిమాకు అవకాశం దక్కింది. ఈ సినిమాలోని నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను.
 
- క‌థ‌గా చెప్పాలంటే శ్రీ‌కాంత్, చిట్టి క‌థే. జాతి ర‌త్నాలు అంటే, మ‌న‌మంతా డిఫ‌రెంట్ లెవ‌ల్‌లో డిఫ‌రెంట్‌గా వుంటాం. సినిమాలోని పాత్ర‌లు కూడా అంతే. అవే జాతిర‌త్నాలుగా ఎలా మారాయి అన్న‌ది టైటిల్‌. క‌థ‌కు స‌రిప‌డా టైటిల్ పెట్టారు. పూర్తి వినోదాత్మ‌కంగా వుంటుంది.
- నాకు తెలుగు డైలాగ్‌లు అర్థంకాక ఇబ్బంది ప‌డేదానిని. మొదట్లో నాకు ఈ మాత్రం కూడా తెలుగు రాక ఇబ్బంది పడుతుంటే ‘ఫర్వాలేదు ఇలా చేయ్‌.. అలా చేయ్‌’ అని తోటి న‌టులు స‌పోర్ట్ చేశారు. తొలి సినిమానే పెద్ద నిర్మాణ సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. రథన్‌ సంగీతం అద్భుతం.
 
- స్టేజీ చేయ‌డం వ‌ల్ల సినిమాలో న‌టించ‌డం చాలా సులువుగా అనిపించింది.
- ఈరోజే మ‌హాత్మాగాంధీ బ‌స్టాండ్‌కు వెళ్ళి అక్క‌డ ప్ర‌యాణికుల‌కు మాస్క్‌లు ఇచ్చాం. వారితో ఇంట్రాక్ట్ అయ్యాము. చాలా థ్రిల్‌గా వుంది. ఇలా అంద‌రితో క‌లిసి వుండటం అనే డ్రీమ్ నెర‌వేరింద‌నిపించింది.
- నా డ్రీమ్ రోల్స్ చాలానే వున్నాయి. అందులో ముందుగా సైకో పాత్ర చేయాల‌నుంది. నాకు డార్క్ కామెడీ అంటే ఇష్టం. ఆ త‌ర‌హా చిత్రాలు ఇక్క‌డ పెద్ద‌గా రాలేదు.
- నా ఇష్ట‌మై న‌టుడు ఫహద్‌ ఫాజిల్‌. అయితే తెలుగులో విజయ్‌ దేవరకొండతో సినిమా చేయాల‌నుంది.