గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (15:58 IST)

మురారి లాంటి సినిమా చేయాల‌నుంది - అశోక్ గ‌ల్లా

Ashok Galla
మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడే అశోక్ గ‌ల్లా. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కూడా అయిన జ‌య‌దేవ్ ఇంటి నుంచి అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ నుంచి వ‌చ్చిన సినిమా `హీరో`. అశోక్ గ‌ల్లా క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. కౌబాయ్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాతో అశోక్ గ‌ల్లాకు న‌టుడిగా మంచి గుర్తింపు వ‌చ్చింది. ఈ సినిమా థియేట‌ర్‌లోనూ ఓటీటీలోనూ విడుద‌లై న‌టుడిగా త‌న‌కెంతో సంతృప్తినిచ్చింద‌ని అశోక్ గ‌ల్లా తెలియిజేస్తున్నారు. ఓటీటీలో వ‌స్తున్న అభినంద‌న‌లు కొత్త ఉత్సాహానిచ్చాయ‌ని తెలియ‌జేస్తూ, తాను చేయ‌బోయే కొత్త సినిమా జూన్‌లో వెల్ల‌డిస్తాన‌ని పేర్కొన్నారు. రేపు ఆయ‌న పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా సోమ‌వారంనాడు  అశోక్ గ‌ల్లాతో జ‌రిపిన ఇంట‌ర్వ్యూ విశేషాలు.
 
కొత్త గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు. ఏదైనా కొత్త సినిమా కోస‌మా?
హీరో స‌క్సెస్ త‌ర్వాత తిరుప‌తి వెళ్ళాను. అందుకే ఈ గెట‌ప్ క‌నిపిస్తుంది.
హీరో సినిమా స‌క్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
హీరో స‌క్సెస్‌ను వృత్తిప‌రంగా సంతృప్తి చెందాను. సినిమాలో హీరోగా నిల‌బ‌డాల‌ని అనుకున్న‌ప్పుడు వ‌చ్చిన స‌క్సెస్ ఇది. ఇప్పుడు త‌ర్వాత ఏమి చేయాల‌నేది ఆలోచిస్తున్నాను.
హీరో క‌థ‌ను ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ చెప్పిన‌ప్పుడు ఎలా అనిపించింది?
నేను మంచి క‌థ‌తో రావాల‌నుకున్నాను. ఆ స‌మ‌యంలో అనుకోకుండా శ్రీ‌రామ్ వ‌చ్చి భోజ‌నం టైంలో క‌థ చెప్పారు. అది విన్న‌వెంట‌నే ఇదే క‌దా మ‌నం చేయాల్సింది అనిపించింది. వెంట‌నే ఓకే చెప్పేశాను. ఆ త‌ర్వాత ఆయ‌న ఆఫీస్‌కూడా తీయ‌డం ప‌నులు జ‌ర‌గ‌డం చ‌కచ‌కా జ‌రిగిపోయాయి.
మ‌ళ్ళీ ఆయ‌న‌తో సినిమా చేసే అవ‌కాశం వుందా?
ప్ర‌స్తుతం వేరే సినిమా చేయాల‌నుకుంటున్నాను. అవ‌కాశం వుంటే త‌ప్ప‌కుండా చేస్తాను.
హీరో సినిమా చూశాక ఇంకా ఏమైనా కొత్త‌గా చేస్తే బాగుంటుంద‌నిపించిందా?
ఇది న్యూ ఏజ్ స్టోరీ. ఈ క‌థ‌ను కామెడీగా చూపించాం. సీరియ‌స్‌గానూ కామెడీ లేకుండా చేయ‌వ‌చ్చు. ప్రోగ్రెసివ్ స్టోరీ క‌నుక తెలుగులో ఫార్మెట్ చేయ‌డంవ‌ల్ల కొత్త కిక్ ఇచ్చేలా చేశాం.
త‌దుప‌రి మీ బేన‌ర్‌లోనే సినిమా వుంటుందా?
బ‌య‌ట బేన‌ర్‌లో వుండ‌బోతోంది. త్వ‌ర‌లో వివ‌రాలు తెలియ‌జేస్తాను.
హీరో సినిమా విడుద‌ల‌య్యాక మీర‌నుకున్న‌ది ఫుల్‌ఫిల్ అయిందా?
సంక్రాంతికి రావాల్సింది రాలేదు. అప్పుడ‌యితే ప్రేక్ష‌కులు బాగా వ‌చ్చేవారు. అందుకే ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా రాలేద‌నే కొద్దిగా నిరుత్సాహం వుంది. మేం విడుద‌ల తేదీని చూసేట‌ప్పుడు అన్ని అంశాలు చూసుకున్నాం. క‌రోనా మార్చిలో ఎక్క‌వ‌వుతుంది అనుకున్నాం. కానీ జ‌న‌వ‌రిలోనే బాగా ఎక్కువ‌యింది. ఏదైనా ప్రేక్ష‌కులు సేఫ్టీని దృష్టిలో పెట్టుకోవాలి క‌దా అందుకే పెద్ద‌గా ఫీల్‌కాలేదు.
హీరో సినిమా చూశాక మ‌హేష్‌బాబు రెస్పాన్స్ ఎలా వుంది?
మ‌హేష్‌బాబు సినిమా చూశాక‌,  ఐమాయ్ ప్రౌడాఫ్ యు.. అన్నారు. కేవ‌లం ఈ సినిమా గురించే చెప్పారు.  అదేవిధంగా కంటెన్యూటీలో చిన్న‌పాటి త‌ప్పిదాలు వుంటే చెప్పేరు. 
ఓటీటీ విడుద‌ల త‌ర్వాత ఆడియ‌న్స్ స్పంద‌న ఎలా అనిపించింది?
ఓటీటీ విడుద‌ల నాకు సెకండ్ రిలీజ్‌లా అనిపించింది. అప్పుడే చాలా అభినంద‌న‌లు ద‌క్కాయి. ఇంకా హంగామా జ‌రిగిన‌ట్లుంది. థియేట‌ర్‌లో రిలీజ్ చేసేముందు రెండు నెల‌లు ప్ర‌మోష‌న్‌కు స‌రిపోయింది.
న‌ట‌న‌ప‌రంగా ఎటువంటి ప్ర‌శంస‌లు ద‌క్కాయి?
పెర్ ఫార్మెన్స్ ప‌రంగా మెచ్చుకుంటుంటే నాపై నాకే న‌మ్మ‌కం వ‌చ్చేసింది. మోటీవేట్ ఎక్కువ‌యింది. మ‌నం చేసింది బాగానే వుంది అంటున్నారు కాబ‌ట్టి ఇంకా ఎక్కువ చేయాల‌నే ఎన‌ర్జీతోపాటు ఎంక‌రేజ్‌గా అనిపించింది.
హీరోగా మీకిది రెండో పుట్టిన‌రోజా?
కాదు. రెండేళ్ళు క‌రోనావ‌ల్లే సెట్‌లో గ‌డిచిపోయాయి. ఇది మూడో పుట్టిన‌రోజు.
హీరోగా కెరీర్ ఎలా వుండ‌బోతోంది అనుకుంటున్నారు?
న‌టుడిగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల‌నుంది. హీరో సినిమా న‌టుడిగా ప్రూవ్ అయ్యాక ఇంకా కాన్‌ఫిడెంట్ పెరిగింది. త‌ర్వాత క‌థ‌లు, పాత్ర‌లు అనేవి కొత్త‌గా వుండేలా చూసుకోవాలి.
క‌మ‌ర్ష‌యిల్ హీరోగా నిల‌బ‌డాల‌నుందా?
క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాదు. అన్ని జాన‌ర్స్ చేయాల‌నుంది. ఫైటింగ్‌, డాన్స్ అనేది చేయ‌గ‌ల‌ను. న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాల‌న్న‌దే నా కోరిక‌.
ఓటీటీలో చూశాక ఏదైనా కొత్త‌గా అనిపించిందా?
ఎడిటింగ్‌లోనే సినిమాను చాలా సార్లు చూశాను. రిలీజ్‌కుముందు వంద‌సార్లు చూశాను. అందుకే ఓటీటీలో చూశాక పెద్ద‌గా తేడా అనిపించ‌లేదు.
క‌రోనావ‌ల్ల మొద‌ట సినిమా ఆల‌స్య‌మైంది. ఇప్పుడు స్పీడ్ పెంచుతారా?
ప్ర‌తి సినిమా రెండేళ్ళు చేయాలంటే క‌ష్ట‌మే. అందుకే సినిమాలు పెంచాల‌ని అనుకుంటున్నా.
కొత్త సినిమా వివ‌రాలు?
రెండు, మూడు సినిమాలు రెడీగా వున్నాయి. ఏద‌నేది ఫైన‌ల్ అయ్యాక జూన్‌లో తెలియ‌జేస్తాను.
ఎలాంటి జోన‌ర్‌లో వుండ‌బోతోంది?
క‌మ‌ర్షియ‌ల్ కామెడీ చేసేశాను. కాబ‌ట్టి క‌థ‌లో డెప్త్ వుండేవి చేయాల‌నుంది. ఇంటెన్‌సిటీ క‌థ‌లే చేయాల‌నుకుంటున్నా. 
మీకు న‌టుడిగా స్పూర్తి ఎవ‌రు?
ఇంకెవ‌రు.. మ‌హేష్‌బాబుగారే. నేను పెరిగింది ఆయ‌న సినిమాలు చూసే. న‌ట‌న వాతావ‌ర‌ణం అంతా నా చుట్టూనే వుంది.
ఆయ‌న్నుంచి ఏం నేర్చుకున్నారు?
సెల్ప్ రిలీఫ్ అనేది మ‌హేష్‌గారికి బాగా తెలుసు. కాన్‌ఫిడెన్స్ అనేది మ‌నలోనే వుంటుంది. ఇవి ఆయ‌న్నుంచి నేర్చుకున్నా.
పాన్ ఇండియా సినిమాలు వస్తున్న త‌రుణంలో మీరు హీరోగా చేయ‌డం ఎలా అనిపిస్తుంది?
వాటి గురించి పెద్ద‌గా ఆలోచించ‌లేదు. తెలుగులోనే ప‌రిచ‌యం అవ్వాల‌నుకున్నాను. ప‌రిచ‌యం అయ్యా. ఇక్క‌డే వుండాల‌నుకుంటున్నా. పాన్ ఇండియా మార్కెట్ అనేది నిర్మాత చూసుకుంటారు. నేను ఒక‌చోట నిల‌బ‌డితే ఆ త‌ర్వాత పాన్ ఇండియా అనేది ఆలోచించాలి.
సూప‌ర్‌స్టార్ ఫ్యామిలీ నుంచి వ‌స్తున్నారు కాబ‌ట్టి ఏవైనా స‌ల‌హాలు ఫ్యామిలీలో ఇచ్చారా?
ఏదైనా హిట్ ప్లాప్ పైనే ఆధార‌ప‌డివుంటుంది. మంచి క‌థ‌లు, పాత్ర‌లు చేయ‌డ‌మే నా ముందున్న క‌ర్త‌వ్యం. 
ఒత్తిడి ఏమైనా వుందా?
అలాంటిది ఇప్పుడు ఏమీ లేదు. మొద‌టి సినిమాకు ఏదైనా త‌ట్టుకోగ‌ల‌వా? అని ప్యామిలీలో అడిగేవారు. హీరో సినిమా రిలీజ్ టైంలో కొంచెం టెన్ష‌న్ గుర‌య్యాను. ఇప్పుడు అదేమీలేదు. త‌ర్వాత సినిమాపై దృష్టంతా వుంది. 
యాక్టింగ్ స్కూల్‌లో ఏం నేర్చుకున్నారు?
నేను ఏడ‌వ త‌ర‌గ‌తి సింగ‌పూర్ బోర్డింగ్ స్కూల్‌లో చ‌దివాను. అలా 12వ త‌ర‌గ‌తివ‌ర‌కు వున్నా. అక్క‌డ సూల్లో యాక్టింగ్ కోర్సుకూడా ఓ భాగం. వెస్ట్ర‌న్ డ్రామా, షేక్స్‌పియ‌ర్ డ్రామాలు క్లాస్‌లో చెబుతుండేవారు. అక్క‌డే చాలా నేర్చుకున్నా.
రెండు రోజుల క్రితం ప‌బ్ ఇష్యూలో మీపేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏమ‌నిపించింది?
నేను ఆరోజు ఫిజియో థెర‌పీ చేయించుకుంటున్నాను. ష‌డెన్‌గా వార్త‌ల్లో నా పేరు ఎలా వ‌చ్చిందో తెలీదు. అప్పుడు హీరో అనే ఫీలింగ్ కలిగింది. సెల‌బ్రిటీ లైఫ్‌లో వుంటే ఇలానే వ‌స్తుంటాయ‌నిపించింది. 
కృష్ణ‌గారు మీ హీరో సినిమాను ఎన్నిసార్లు చూశారు?
ఆయ‌న ఒక‌సారే చూశారు. కౌబాయ్ సినిమా కాబ‌ట్టి బాగా ఎంజాయ్ చేశారు. సినిమా చూశాక ఫ‌ర్‌ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పేశారు.
ఈసారి పుట్టిన‌రోజు ఎలా సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు?
పెద్ద‌గా ఏమీ చేసుకోను. నా ఫ్యామిలీతోనే సెల‌బ్రేష‌న్‌. అయితే ఈసారి 30వ పుట్టిన‌రోజు కాబ‌ట్టి స్నేహితుల‌తో చేసుకుంటాను. 
మ‌హేష్‌బాబు సినిమాల్లో మీరు చేయాల‌నుకుంటే ఏ మూవీ చేస్తారు?
మురారి సినిమా. అలాంటి సినిమా మ‌ర‌లా రాలేదు. ముందుముందు కూడా రాదు. 
బ‌ర్త్‌డే రిజ‌ల్యూష‌న్స్ వున్నాయా?
అంత డీప్‌గా ఆలోచించ‌లేదు.
వెబ్ సిరీస్ చేసే ఆలోచ‌న‌వుందా?
ఇప్ప‌టివ‌ర‌కు న‌న్ను ఎవ‌రూ అప్రోచ్ కాలేదు. మంచి క‌థ‌తో వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తా. వెబ్ సిరీస్ చేస్తే కొత్త సాటిస్‌ఫేక్ష‌న్‌గా వుంటుంది.