1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (17:35 IST)

కార్తికేయకు మంచి హిట్‌ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా : హీరో శ్రీవిష్ణు

Karthikeya, Srivishnu and Neha Shetty
Karthikeya, Srivishnu and Neha Shetty
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'బెదురులంక 2012'. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రవీంద్ర (బెన్నీ) బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత వారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.ఈ సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం నాడు విజయోత్సవ సభను నిర్వహించింది.ఈ కార్యక్రమానికి యువ హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 
 
కార్తికేయ మాట్లాడుతూ... ‘‘విజయోత్సవ కార్యక్రమానికి వచ్చిన శ్రీ విష్ణు అన్నకి థాంక్స్. క్లాక్స్ ఈ కథను చెప్పినప్పటి నుంచీ నాకు నమ్మకం ఉంది. కలెక్షన్లు డే బై డే పెరుగుతూనే ఉన్నాయి. మేం నమ్మి తీసుకున్న నిర్ణయాన్ని ప్రేక్షకులు సమర్థించడం, సపోర్ట్ చేయడం అనేది నాకు పెద్ద సక్సెస్ అనిపిస్తుంది. వీక్ డేస్‌లోనూ హోల్డ్ చేస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బాగుందని అందరూ చెప్పిన తరువాత నాకు ఎంతో సంతృప్తి కలిగింది. గత నాలుగైదేళ్లుగా ఎన్నో రకాల పాత్రలు చేస్తున్నాను. ఇప్పుడు ఇన్నాళ్లకు నేను నమ్మింది జరిగింది. నాకు పెద్ద రిలీఫ్ అనిపించింది. అలాంటి రిలీఫ్ ఇచ్చిన ఆడియెన్స్‌కు థాంక్స్. ఈ సినిమా ప్రయాణం ప్రారంభమై ఏడాదిన్నర అవుతోంది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. మేం నమ్మిన దానికి నిలబడ్డాం. అందుకే ఇన్ని కష్టాలు వస్తున్నాయని అనుకునేవాళ్లం. సక్సెస్ రావడంతో ఏడాదిన్నరగా చేసిన ఈ ప్రయాణం మాకు ఎంతో ఇష్టంగా మారింది. ఇలా సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లు అవుతోంది. నేను ఇంత వరకు చేసినా సినిమాలు ఆడినా, ఆడకపోయినా ప్రేక్షకులు నన్ను సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. ఆర్ఎక్స్ 100 తరువాత నేను చేసిన సినిమాలు అనుకున్న రేంజ్‌కు వెళ్లలేదు. 'కచ్చితంగా విజయం సాధిస్తావ్' అని నన్ను నమ్మిన ప్రేక్షకులు, ఇండస్ట్రీ వ్యక్తులకు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ థాంక్స్. ఒక్క హిట్ వస్తే చాలు అనుకున్న టైంలోనే బెదురులంక వచ్చింది. నన్ను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమాతో నవ్వులు పంచాను. అదే నేను ప్రేక్షకులకు ఇచ్చే బహుమతి. మంచి సినిమా తీశామని ప్రేక్షకులు చెబితే అదే నాకు పెద్ద సంతృప్తి. నాకు ఈ అవకాశం ఇచ్చిన క్లాక్స్‌కు థాంక్స్. ఈ సక్సెస్ క్రెడిట్ అజయ్ భూపతికే ఇస్తాను. ఆర్ఎక్స్ 100తోనే నాకు గుర్తింపును ఇచ్చారు. నేను లైఫ్‌లో ఏ సక్సెస్ సాధించినా అది ఆయన వల్లే. ఆయనకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎన్ని బాధలు వచ్చినా సినిమాను ఇంత వరకు తీసుకు వచ్చిన బెన్ని గారికి థాంక్స్.  నేహాను ఇన్ని రోజులు రాధిక, రాధిక అన్నారు.. ఇప్పుడు చిత్ర, చిత్ర అని పిలుస్తున్నారు. ఆమెకు అందం, అభినయం, డ్యాన్స్ ఇలా అన్నీ ఉన్నాయి. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మణిశర్మ గారు ఇచ్చిన ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ముందే చెప్పాను. సామజవరగమన హిట్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రేక్షకులే మా సినిమాను హిట్ చేశారు. సినిమా నచ్చితే ప్రేక్షకులే హిట్ చేస్తారు అని మళ్లీ నిరూపించారు’’ అని అన్నారు.
 
శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం. నాకు ఈ కథ 2009లోనే తెలుసు. క్లాక్స్ నాకు కథలు అప్పటి నుంచి చెబుతూనే ఉండేవాడు. క్లాక్స్ ఎంతో కష్టపడ్డాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం. నిర్మాతలు ముందుకు రారని క్లాక్స్‌కి చెప్పాను. కమర్షియల్ ఫార్మాట్లో సినిమాను చేయమని చెప్పాను. కానీ బెన్ని లాంటి నిర్మాతలు ఇప్పుడు ఉన్నారు. కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. క్లాక్స్ దగ్గరున్న అద్భుతమైన కథలను ఫాస్ట్ ఫాస్ట్‌గా చేయాలని కోరుకుంటున్నాను. మణిశర్మ గారి పనితనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేహా శెట్టి పేరు నాకు తెలీదు. రాధిక మాత్రమే తెలుసు. ఇప్పుడు చిత్ర అంటున్నారు. ఇలా పాత్రల పేరుతో గుర్తుండేలా నటించడం మామూలు విషయం కాదు. సోషల్ మీడియాలో నేను చాలా తక్కువగా ఉంటాను. ఆర్ఎక్స్ 100 పిల్లా రా పాట విని షాక్ అయ్యాను. అందులో కార్తికేయను చూసి ట్వీట్ వేశాను. ఆర్ ఎక్స్ 100 సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కొత్త కొత్త పాత్రలు చేస్తూనే ఉన్నాడు. పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు బెదురులంకతో హిట్ కొట్టేశాడు. కార్తికేయ నాకు చాలా ఇష్టం. ఆయన్ను చూస్తే నాకు సోదరభావం కలుగుతుంది. ఈ సినిమాను ఇంకా చూడని వాళ్లుంటే థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు.
 
బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘‘కార్తికేయకు ఇంత మంచి విజయం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను కూడా చిన్న పాత్రలో నటించాను. బెన్నీ చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత.  కొత్త కథలను ఎంచుకునే మార్కెట్ గురించి తెలిసి వ్యక్తి బెన్నీ. నేహా శెట్టి మీద గౌరవం పెరిగింది. అందంగా ఉంది. తెలుగు మాట్లాడుతుంది. తెలుగులో మంచి అవకాశాలు వస్తాయి. ఇక్కడకు వచ్చిన శ్రీ విష్ణుకి థాంక్స్. సినిమా అంటే పిచ్చితో పని చేస్తుంటాడు. అలాంటి ప్యాషన్ అల్లు అర్జున్‌లో చూశాను. కార్తికేయ, నేను ఒకసారి పార్క్ హయత్‌లో కలిశాను. పది నిమిషాలు అనుకుంటే అర్దరాత్రి వరకు మీటింగ్ జరిగింది. నేను చిరంజీవి ఫ్యాన్‌ని... ఆ విషయం ఆయనకు చెప్పాలి అని అంటాడు. రాత్రి మూడు గంటలకు వీడియో తీసి చిరంజీవి గారికి పంపించాను. అప్పటి నుంచి మేం ఇద్దరం ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నాం. కార్తికేయ ఇప్పుడు మాస్ హీరోగా సక్సెస్ అయ్యాడు. క్లాక్స్ వచ్చి ఈ పాత్ర గురించి చెప్పాడు. హాఫ్ డే ఉంటే చాలు అన్నాడు. ఇది రెగ్యులర్ కమర్షియల్ కాదు. ఈ సినిమాను క్లాక్స్ అద్భుతంగా తెరకెక్కించాడు’’ అని అన్నారు.
 
అజయ్ భూపతి మాట్లాడుతూ... ‘‘సినిమా టీంకు కంగ్రాట్స్. ఆర్ఎక్స్ 100 అందరికీ లైఫ్ ఇచ్చింది. కానీ నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం కార్తికేయ. ఆ సినిమాను నిర్మించింది ఆయనే. కార్తికేయకు హిట్ వస్తే నాకు కూడా హిట్ వచ్చినట్టే. ఆయనకు విజయం రావడం నాకు ఆనందంగా ఉంది. క్లాక్స్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆర్జీవీ దగ్గర నుంచి నేను బయటకు వస్తుంటే... క్లాక్స్ ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. క్లాక్స్‌కు ఇంత మంచి హిట్ రావడం ఆనందంగా ఉంది. అన్ని పాత్రలను బాగా చూపించాడు. పెద్ద హీరోలుంటే థియేటర్లకు వెళ్లాలని ప్రేక్షకులు ఆలోచించడం లేదు. సినిమా బాగుంటేనే వెళ్తున్నారు. అలాంటి ప్రేక్షకులు ఉండటం మన అదృష్టం. టీం అందరికీ కంగ్రాట్స్ అండ్ థాంక్స్. మా కార్తికేయకు హిట్ ఇచ్చినందుకు అందరికీ థాంక్స్’’ అని అన్నారు.
 
నేహా శెట్టి మాట్లాడుతూ.. ‘‘నాకు రెండో హిట్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. మేం ఈ సినిమాను ఫిబ్రవరిలోనే విడుదల చేయాలి. కానీ ఆలస్యం అవుతూ వచ్చింది. నేను చాలా బాధపడ్డాను.భయపడ్డాను. అన్నీ మంచికే జరుగుతాయని మా హీరో దర్శక నిర్మాతలు అంటూ ఉండేవారు. టైం పట్టినా కూడా మేం మంచి సినిమాను తీశాం. ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’’ అని అన్నారు.
 
చిత్రనిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని మాట్లాడుతూ... ‘‘ఇక్కడకు వచ్చిన శ్రీ విష్ణు, బీవీఎస్ రవి, అజయ్ భూపతి గారికి థాంక్స్. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’’ అని అన్నారు. ఇంకా కార్యక్రమంలో నటుడు రాజ్‌ కుమార్‌ కసిరెడ్డితో పాటు పలువురు యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.