ది కశ్మీర్ ఫైల్స్‌కు ప్రజలే అవార్డ్ గెలుచుకున్నారు: అభిషేక్ అగర్వాల్
‘‘69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజల సినిమా. ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు'' అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. ‘69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం, అలాగే ఉత్తమ సహాయనటిగా పల్లవి జోషి అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గారికి, పల్లవి జోషిగారికి, ఈ చిత్రం కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ది కశ్మీర్ ఫైల్స్ ఇది ప్రజల సినిమా. ప్రజలు ఎంతో గొప్పగా ఆదరించారు. ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు. దేశ ప్రజలకు, కశ్మీర్ పండిట్లందరికీ ఈ పురస్కారాల్ని అంకితమిస్తున్నాం'' అన్నారు.
అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గారు అవార్డ్ పొందడం చాలా అనందంగా వుంది. రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు రావడం, ఉప్పెన, కొండపొలం పాట కి చంద్రబోస్ గారికి అవార్డులు రావడం చాలా సంతోషంగా వుంది'' అన్నారు.
‘’కార్తికేయ 2 తర్వాత ప్రస్తుతం మేము నిర్మిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. పాన్ ఇండియా ఆడియన్స్ అలరించే కంటెంట్ టైగర్ నాగేశ్వరరావు లో ఉంది. అక్టోబర్ 20న విడుదల చేస్తున్నాం. దానికి కూడా జాతీయ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం కావాలి’’ అని కోరారు.