నన్ను బయటి వాడిలా చూశారు చాలా బాధేసింది - నాని ఆవేదన
నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. 'నిన్నుకోరి' తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో ట్రైలర్‌ను విడుదలచేశారు.
ఈ సందర్భంగా నానికి కొన్ని ప్రశ్నలు ఇబ్బంది కలిగించాయి. ఆరునూరైనా థియేటర్లలో విడుదల చేస్తానన్న సినిమాను ఓటీటీలో విడుదలచేయాల్సిరావడం, అందుకు కొందరు కొన్ని రకాల కామెంట్ చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
`థియేటర్లో కాకుండా సినిమాను ఓటీటీ విడుదల చేయడంపై కొంత మంది కొన్ని రకాల కామెంట్లు చేశారు. వారంతా నాకంటే పెద్దవాళ్లు. వారున్న పరిస్థితుల్లో అలా మాట్లాడటంలో తప్పు లేదు. ఆ కాసేపు వాళ్లు నన్ను బయటి వాడిలా చేసేశారు. అదే నాకు బాధ. నేను వారి బాధను అర్థం చేసుకుంటాను. బిజినెస్‌పరంగా కొన్ని లెక్కలుంటాయి. వాటి ఆధారంగా ఓటీటీకి వెళ్ళాల్సివచ్చింది. బయటగానీ, సోషల్ మీడియాలోకానీ ఏదో రాసేస్తారు. కానీ వాస్తం వేరుగా వుంటుంది. ప్రస్తుతం థియేటర్‌లో సినిమాలు అంతా కలిసి చూసే వాతావరణం లేదని` అన్నారు. ఏదిఏమైనా త్వరలోనే కోవిడ్‌నుంచి అందరూ బయటపడి థియేటర్లకు వచ్చే వాతావరణ వుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.