ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ఆస్కార్ వేదికపై ఇద్దరు భారతీయులు కనిపించారు.... ఎన్టీఆర్

jrntr
ఆస్కార్ వేదికపై తనకు ఇద్దరు భారతీయులు.. ఇద్దరు తెలుగు వారు కనిపించారని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. విష్వక్సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం "దాస్ కా ధమ్కీ" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ మాట్లాడుతూ, "ఆర్ఆర్ఆర్" చిత్రం ఈ రోజున ప్రపంచపటంలో నిలవడానికి, ఆస్కార్ అవార్డును కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు రాజమౌళి ఎంత కారణమో, సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఎంత కారణమో ఆ పాటను ఆదరించిన ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు, వారి అభిమానం అంతే కారణమన్నారు. 
 
"ఆ అవార్డును సాధించింది మీరే.. మీ అందరి బదులుగా మేం అక్కడికి వెళ్లాం. మా అందరి బదులుగా కీరవాణి, చంద్రబోస్‌లు వేదికపై నిల్చొన్నారు. ఆ స్టేజ్‌పై తనకు కీరవాణి - చంద్రబోస్‌లు కనిపించలేదు. ఇద్దరు భారతీయులు కనిపించారు. ఇద్దరు తెలుగువారు కనిపించారు. వేదికపై తెలుగుదనం ఉట్టిపడింది" అని అన్నారు. 
 
ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన మీకు ఎలా అనిపించిందోగానీ రెండు నేత్రాలతో ప్రత్యక్షంగా చూడటం మరిచిపోలేని అనుభూతినిచ్చింది. మళ్లీ అంతటి అనుభూతిని ఎప్పటికి పొందుతామో తెలియదు. 'ఆర్ఆర్ఆర్' ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమా మరింత ముందుకుసాగాలని ఆశిస్తున్నాను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.