సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (11:05 IST)

శంకర్ పక్కా ప్లాన్.. నాలుగు నెలల్లో భారతీయుడు పూర్తి!

సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ - విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం "భారతీయుడు-2". ఈ చిత్ర షూటింగ్‌ను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకుతగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
శంకర్ - రజనీకాంత్ - అక్షయ్ కుమార్‌ల కాంబినేషన్‌లో ఇటీవల "2.O" చిత్రం విచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఈ చిత్రం షూటింగ్ ఏకంగా మూడున్నరేళ్ళపాటు సాగింది. అయినప్పటికీ ఈ చిత్రం మంచి సక్సెస్‌ సాధించింది. 
 
ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రాన్ని కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. పైగా, వచ్చే వేసవి సెలవుల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకునిరావాలని భావిస్తున్నారు. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 18వ తేదీ నుంచి పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. 
 
తొలి షెడ్యూల్‌లో కమల్‌హాసన్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. పొల్లాచ్చి అనంతరం ఉక్రెయిన్‌లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం ప్రాచీన యుద్దవిద్యల్లో ఆమె శిక్షణ తీసుకుంటోంది. 
 
కాగా, 1996లో కమల్‌హాసన్, శంకర్ కలయికలో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పైగా, రాజకీయ రంగ ప్రవేశం చేసిన కమల్ హాసన్ నటించే చివరి చిత్రం కూడా ఇదే కానుంది.