మెగాస్టార్ చిరంజీవి విమర్శిస్తే బాధేస్తుందని : కార్తికేయ గుమ్మకొండ
మెగాస్టార్ చిరంజీవిని కొందరు ఉద్దేశ్యపూర్వకంగా విమర్శిస్తే బాధేస్తుందని యువ హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నారు. ఒక చిత్రం పరాజయం పొందితే నచ్చలేదు, బాగోలేదు అని సినిమాని అనడం ఓకేగానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసే వారిది చిన్న మనస్తత్వం అనిపిస్తుందన్నారు. చిరంజీవినే కాదు అలా ఎవరినీ అనకూడదని విజ్ఞప్తి చేశారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన చూసిన ఒడిదొడుకుల ముందు ఇది చిన్న విషయం. దానికి ఆయన ఫీలవ్వకుండా తదుపరి సినిమాపై దృష్టిపెడతారని నాకు అనిపిస్తుంది' అని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన కొత్త చిత్రం 'బెదురులంక 2012' సినిమా ప్రచారంలో భాగంగా కార్తికేయ పై విధంగా స్పందించారు.
ఇకపోతే, తన సినిమా గురించి మాట్లాడుతూ, 'ఆర్‌ఎక్స్ 100' ట్రైలర్‌ని, 'బెదురులంక 2012' ట్రైలర్‌ని ప్రముఖ హీరో రామ్‌చరణ్ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ రెండు సినిమాల్లో తన పాత్ర పేరు శివ అని, అది యాదృచ్ఛికంగా జరిగిందని తెలిపారు. సన్నివేశం డిమాండ్ మేరకు శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి అసలు పేరు)గా డైలాగ్ చెప్పానన్నారు. ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన నేహాశెట్టి నటించారు.