గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2023 (20:29 IST)

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టిల రూల్స్ రంజన్ డేట్ ఫిక్స్

Kiran Abbavaram, Neha Shetty, A.M. Ratnam, Ratnam Krishna, Divyang Lavania, Murali Krishna Vemuri
Kiran Abbavaram, Neha Shetty, A.M. Ratnam, Ratnam Krishna, Divyang Lavania, Murali Krishna Vemuri
కిరణ్ అబ్బవరం తాజా చిత్రం 'రూల్స్ రంజన్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'నీ మనసు నాకు తెలుసు', 'ఆక్సిజన్' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. పాటలకు వస్తున్న అద్భుతమైన స్పందనతో ఎంతో సంతోషంగా ఉన్న నిర్మాతలు తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
 
'ఇంట్రడక్షన్ ఆఫ్ రూల్స్ రంజాన్' పేరుతో ఈరోజు(సెప్టెంబర్ 4న) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా కోసం ప్రత్యేకంగా నాలుగో పాటని ప్రదర్శించారు. గత మూడు పాటల్లాగే నాలుగో పాట కూడా కట్టిపడేసింది. అలాగే ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ఏ.ఎం. రత్నం చేతుల మీదుగా విడుదల తేదీని వెల్లడించారు.
 
సుప్రసిద్ధ నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ,  సంగీతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పాను. నా అనుభవం ప్రకారం ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే. 'రంగస్థలం', 'అల వైకుంఠపురములో' వంటి సినిమాలు ఆడియో ఎంత హిట్టో, సినిమాలు అంతకుమించిన హిట్ అయ్యాయి. సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకి అమ్రిష్ అద్భుతమైన సంగీతం అందించారు. అన్నారు.
 
కథానాయకుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నేను మనో రంజన్ అనే పాత్ర పోషించాను. మనో రంజన్ మనలో ఒకడిలా ఉంటాడు. అందరూ ఈ పాత్రకి కనెక్ట్ అవుతారు. ఇంత మంచి పాటలు ఇచ్చిన అమ్రిష్ గారికి ధన్యవాదాలు. నేపథ్య సంగీతం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏ.ఎం. రత్నం గారి సినిమా చూస్తూ పెరిగాను. ఆయన నిర్మించిన సినిమాల్లో ఖుషి అభిమాన చిత్రం. ఏ.ఎం. రత్నం గారు మా సినిమాని సమర్పించడం గర్వంగా ఉంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన దర్శకనిర్మాతలకు, నేహా శెట్టి, ఇతర చిత్ర బృందానికి అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు" అన్నారు.
 
కథానాయిక నేహా శెట్టి మాట్లాడుతూ.. 'డీజే టిల్లు'లో రాధిక పాత్ర తర్వాత, ఈ సినిమాలో నేను పోషించిన సనా పాత్ర ప్రేక్షకులను అంతలా మెప్పిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అన్నారు.
 
దర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ..  ఈ సినిమాని మేము సొంతంగా నిర్మించాలి అనుకున్నాం. అనుకోకుండా ఈ కథ నా స్నేహితులు దివ్యాంగ్, మురళికి వినిపించడం.. వారు పట్టుబట్టి సినిమా నిర్మిస్తామని ముందుకు రావడం జరిగిపోయాయి" అన్నారు.
 
నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి మాట్లాడుతూ.. "ఏ.ఎం. రత్నం గారి ద్వారా ఏడాది క్రితం ఈ కథ మా దగ్గరకు వచ్చింది. ఆయన ఆశీస్సులతోనే మేము ముందడుగు వేశాం. కృష్ణ చెప్పిన కథ మాకు ఎంతగానో నచ్చింది. అప్పుడే బ్లాక్ బస్టర్ ని అందిస్తానని నమ్మకం కలిగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ చిత్రాన్ని ఎంతో అందంగా మలిచారు." అన్నారు.