ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (14:57 IST)

మెగాస్టార్‌గా అడుగు త‌గ్గ‌లేదు, సంయ‌మ‌నం పాటించాః మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi,
Megastar Chiranjeevi,
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ సినిమా వ‌ల్ల ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న ప‌లువురిని క‌ల‌వ‌డం జ‌రిగింది. తాజాగా గురువారంనాడు కొంత‌మంది మీడియాతో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న స్వ‌గృహంలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా సినిమా గురించి, సినిమా ఇండ‌స్ట్రీ గురించి, రాజ‌కీయాల గురించి చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అవి మీ కోసం.
 
మెగాస్టార్‌గా వుండి ఒక్కోసారి ఒక అడుగు త‌గ్గేస్థాయికి దిగారు. ఇది క‌రెక్టేనా అని అభిమానులు అనుకుంటున్నారు?
అది అడుగు త‌గ్గ‌డం కాదండి. సంయ‌మ‌నం పాటించాలి. అప్పుడే నిజా నిజాలు తెలుస్తాయి. నేను తప్పు చేయ‌ను. అవ‌త‌లివారు నా గురించి త‌ప్పుగా మాట్లాడితే ఢీ కొట్ట‌డం కంటే వెళ్ళి వారిని క‌లుస్తాను. నేను పాలిటిక్స్‌లోకి వెళ‌తాను అన్న‌ప్పుడు నేను నిర్వ‌హించే బ్ల‌డ్ బ్యాంక్‌, నా వ్య‌క్తిగ‌తం, లాండ్ గ్రాబింగ్ వంటి ఆరోప‌ణ‌లు చేశారు. అలా చేసిన‌వారు కోర్టుకు వెళ్ళారు. వారు ఏం చేశారో వారి అంత‌రాత్మ‌కు తెలియ‌దా? ఆ త‌ర్వాత వారే నా ద‌గ్గ‌ర‌కువ‌చ్చి క్ష‌మించ‌మ‌ని అడిగారు. నాకు ఎవ‌రిపైనా కోపం లేదు. నేనెప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఒక‌టి ప‌క్క‌న ఎన్ని సున్నాలు వున్నాయ‌ని కాదు. నా గుండెలో ఎంత‌మంది హృద‌యాల‌నకు ద‌గ్గ‌ర‌య్యాను అనేది చూస్తాను. నేను ఎక్కువ‌మంది మ‌న‌సుల‌ను గెలుచుకున్నాను. 
 
ఎవ‌రు ఎలా మాట్లాడినా త‌ప్పు వారిదే. నా త‌ప్పు వుంటే అంద‌రికంటే ముందుకు వెళ‌తాను. గ‌తంలో నేను రాజ‌కీయాల్లోకి వెళ‌తాను అన‌గానే కొంద‌రు (రాజ‌శేఖ‌ర్, జీవిత‌) కామెంట్ చేశారు. అది తెలిసి వారిపై కొంద‌రు రాళ్ళు విసిరారు. నేను ఇంటికి వెళ్ళి అందులో నా త‌ప్పులేద‌ని చెప్ప‌డానికి రెండుగంట‌ల‌పైకా వారికోసం ఎదురుచూశాను. అప్ప‌టికే వారు కొంద‌రు మీడియా ఛాన‌ల్స్ పిలిస్తే వెళ్ళార‌ని తెలిసింది. వారు వ‌చ్చాక నేను కాదుగ‌దా త‌ప్పు చేసింది. ఫ్యాన్స్ చేస్తే ఆ త‌ప్పు నాదికాదు. అని వారిని ప‌ర్స‌న‌ల్‌గా క‌లిసి చెప్పాను.
 
ఇంత సంమ‌యం వుందికాబ‌ట్టి మీరు ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కు (గాడ్ ఫాద‌ర్‌)గా వుంటారా?
ఇండ‌స్ట్రీలో గొడ‌వ‌లు స‌మ‌సిపోయేలా చేయ‌డం, పంచాయితీచేసి పెద‌రాయుడులా వుండ‌డం నాకు ఇష్టం వుండ‌దు. వారి వారి మ‌ధ్య ఏవైనా గొడ‌వ‌లు వుంటే వారికి అసోసియేష‌న్‌లు చూసుకుంటాయి. టోట‌ల్‌గా ఇండ‌స్ట్రీ అవ‌స‌రం వుంటే నావంతు సాయంగా నేను సాయం చేస్తాను.
 
ఆంధ్ర‌ప‌దేశ్‌లో ప్ర‌జారాజ్యం పార్టీ గ‌నుక వుండివుంటే ఈపాటికి రాజ‌కీయ లోటు తీరేద‌ని బ‌య‌ట చాలామంది అంటున్నారు. ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా?
 
అప్ప‌ట్లో ఇలాంటి ప‌రిణామాలు వుండి  వుంటే నేను ఎ.పి.కే ప‌రిమితం అయ్యేవాడిని. తెలంగాణాకు దూరం అయ్యేవాడిని. అప్పుడు నేను తెలంగాణ‌, ఆంధ్ర నుంచి ఎంతో మంది అభిమానులు, అభిమానం పొంద‌గ‌లిగేవాడిని కాదు. ఇప్పుడు రెండింటికి నా అవస‌రం వుంది. అని ముగించారు.