కుటుంబంతో కలిసి ఓజీ చూశాను : చిరంజీవి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి తాజా చిత్రం "ఓజీ". ఈ సినిమాను మెగా కుటుంబమంతా కలిసి వీక్షించిన విషయం తెలిసిందే. సినిమా చూసిన అనంతరం అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ సినిమాపై పూర్తి రివ్యూ ఇచ్చారు. తన అభిమానులకు కావాల్సిన వినోదాల విందును పవన్ ఈ సినిమాతో ఇచ్చారని తెలిపారు. కుటుంబంతో పాటు, 'ఓజీ' మూవీ యూనిట్‌తో కలిసి థియేటరులో దిగిన ఫొటోలను చిరంజీవి పంచుకున్నారు.
'నా కుటుంబంతో కలిసి ఓజీ చూశాను. చిత్రంలోని ప్రతి అంశాన్ని పూర్తిగా ఆస్వాదించాను. హాలీవుడ్ ప్రమాణాలకు తగినట్లు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రమిది. భావోద్వేగాలకు లోటులేకుండా రూపొందించారు. ప్రారంభ సన్నివేశం నుంచి క్లైమాక్స్ వరకూ ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు సుజీత్ అసాధారణరీతిలో రూపొందించాడు. పవన్ కల్యాణ్‌ను తెరపై ఇలా చూడడం చాలా గర్వంగా అనిపించింది.
తన ప్రత్యేక ఆకర్షణతో సినిమాను నిలబెట్టాడు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న అభిమానులకు 'ఓజీ'తో సరైన విందు ఇచ్చాడు. తమన్ ఈ చిత్రానికి ఆత్మతో సమానం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చిత్రబృందానికి నా అభినందనలు' అని చిరు తన పోస్టులో రాసుకొచ్చారు.
ఇక ఈ సినిమా విడుదలైన నాడు కూడా చిరంజీవి పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌ను అందరూ 'ఓజాస్ గంభీర'గా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమన్ సంగీతం అద్భుతంగా ఉందని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.