మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
బావీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి దేశంలోనే అత్యంత ప్రతష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ యేడాదికి ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. వచ్చే నెల ఎనిమిదో తేదీన జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ పోస్టు చేశారు.
"మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి దాయకం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనకు అందించాలని జ్యూరీ నిర్ణయించింది" అని పేర్కొన్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మిథున్ చక్రవర్తి.. బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించి దేశంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. హీరోగానే కాకుండా సహాయనటుడు, విలన్‌గా కూడా ఆయన ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించారు.
ఆయన చిత్రపరిశ్రమలోకి 1976లో 'మృగాయ'తో నటుడిగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 'ముక్తి', 'బన్సారీ', 'అమర్జీప్', 'ప్రేమ్ వివాహ్', 'భయానక్, 'కస్తూరి', 'కిస్మత్', 'మే ఔర్ మేరా సాధి', 'సాహాస్', 'వాంటెడ్', 'బాక్సర్', 'త్రినేత్ర', 'దుష్మన్', 'దలాల్', 'భీష్మ', 'సుల్తాన్', 'గురు', 'కిక్', 'బాస్', 'డిస్కోడాన్సర్' వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఒక్క హిందీలోనే కాకుండా, హిందీ, బెంగాలీ చిత్రాలతోపాటు కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్‌పురి చిత్రాల్లోనూ ఆయన నటించారు. 'గోపాల గోపాల'తో తెలుగు వారికి సుపరిచితమయ్యారు. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా కనిపించారు. అనంతరం 'మలుపు' అనే టాలీవుడ్ మూవీలోనూ ఆయన యాక్ట్ చేశారు. "ఐ యామే డిస్కో డాన్సర్' అన్న పాటతో దేశవిదేశాల్లో గుర్తింపు తెచ్చుకొన్నారు. ఈ యేడాది మొదట్లో ఆయనకు పద్మభూషణ్ అవార్డును కేంద్రం అందజేసింది.