పోలీసులను వణికించిన వ్యక్తి వీరప్పన్.. ఆసియాలోనే ఎవరూ లేరు : రాంగోపాల్ వర్మ
పోలీసులను వణికించిన వ్యక్తి గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. అలాంటి వ్యక్తి ఆసియాలోనే ఎవరూ లేరు. అందుకే ఆయన ఇతివృత్తాన్ని కథాంశంగా తీసుకుని తనకు నిజాలను సినిమాగా తీసినట్టు వివాదాస్పద దర్శకుడిగా పేరు పొందిన ప్రతిభాశాలి, మేధావి రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ‘వీరప్పన్’పై రూపొందించిన తమిళ చిత్రం ‘విళ్లత్తై విలన్ వీరప్పన్’ ట్రయిలర్ విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది.
ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ 1990ల్లో రెండు ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్ గురించి బీబీసీ కూడా ప్రస్తావించడం నాకు ఆసక్తి కలిగించింది. వీరప్పన్‌ను పట్టుకోవడానికి పోలీసు అధికారుల బృందం జరిపిన కార్యకలాపాలు, గాలింపు చర్యలు తెరకెక్కించాలనిపించిందని తెలిపారు.
'శివ', 'సర్కార్', 'కంపెనీ' చిత్రాల్లో చూపిన వీరోచిత తిరుగుబాటు పాత్రనే వీరప్పన్‌లో కూడా నేను దర్శించాను. అందుకే సినిమాగా రూపొందించాను. పైగా ఎలాంటి అనుచరసైన్యం లేకుండా వీరోచితంగా అడవుల్లో తన కార్యకలాపాలను సాగించి ప్రభుత్వాలు, పోలీసులను వణికించిన వ్యక్తి నాకు ఆసియాలో మరెవరూ కనిపించలేదు. 2001లో వీరప్పన్ మృతి చెందేవరకు అతడి కార్యకలాపాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నాకు తెలిసిన నిజాలతో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పారు.
అంతేకాకుండా, ఈ చిత్రం ఒక దర్శకుడిగా నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగపడిందన్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగాను నాలో చాలా మార్పులు రావడానికి దోహదపడిందని చెప్పారు. దీనికి కారణం ఏమిటంటే వీరప్పన్ జీవితం ఆయన కార్యకలాపాల అంశం అనేక విధాలుగా అత్యంత జటిలమైనది. వీటన్నింటినీ అర్థం చేసుకుని తెరమీద చూపడానికి కష్టపడి పనిచేయవలసి వచ్చిందన్నారు.