జబర్దస్త్ షో నుంచి రోజా, నాగబాబు అవుట్..? అలీ వస్తారా?
సింహం సింగిల్‌గానే వస్తుందన్నట్టు.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని మెజార్జీ సాధించి సీఎం కాబోతున్నారని వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజా అన్నారు. జగన్‌ని ప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారన్న దానికి ఈ మెజార్టీయే నిదర్శనమని రోజా తెలిపారు.
ఏపీలో వైసీపీ సాధించిన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు వెనుక ఉన్న ఎమ్మెల్యేలను చూస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ ఎల్పీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా రోజా మీడియాతో చంద్రబాబును ఏకి పారేశారు.
నగరికి ఎమ్మెల్యే రోజా మళ్లీ ఎన్నికైన తరుణంలో పూర్తి స్థాయి రాజకీయాల్లో దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జబర్దస్త్‌ను పక్కనబెట్టేయాలనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఇంతకుముందు వైకాపా ప్రతిపక్షంగా వుండేదని.. ప్రస్తుతం అధికార పక్షంగా మారిందని.. దీంతో రాజకీయాల్లో రాణించేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తామని రోజా అంటున్నారు. ఇందుకోసం తనకు ఎంతో పేరు తెచ్చిన జబర్దస్త్‌ను కూడా వదిలేయడానికి రోజా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ కామెడీ షోకి నాగబాబు - రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాజకీయ సంబంధమైన కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండటం వలన ఈ ఇద్దరూ 'జబర్దస్త్' కార్యక్రమంలో కనపడలేదు. ఆ తరువాత రోజా వచ్చేసి మళ్లీ సందడి చేస్తోంది గానీ, నాగబాబు ఇంకా జాయిన్ కాలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ఫలితాలు రావడం .. వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగిపోయింది.
జగన్ ముఖ్యమంత్రి అవుతోన్న నేపథ్యంలో రోజాకి మంత్రి పదవి దక్కొచ్చని అంటున్నారు. మంత్రి అయితే ఆమె 'జబర్దస్త్' కార్యక్రమాన్ని వదులుకునే అవకాశం వుంది. ఇక ఎంపీ అయినా తాను 'జబర్దస్త్' వదులుకోనని ఇంతకుముందే నాగబాబు చెప్పారు. ఆయన ఓడిపోవడంతో ఇక 'జబర్దస్త్' కి రావడం ఖాయమని చెప్తున్నారు.
కానీ ఆయన స్థానంలో అలీ వచ్చే అవకాశాలు వున్నాయనే ప్రచారం జరుగుతూ వుంది. మరి రోజా స్థానంలో జబర్దస్త్ జడ్జిగా ఎవరు వస్తారనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియా చర్చ సాగుతోంది.