బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 24 ఏప్రియల్ 2017 (05:15 IST)

బాహుబలితో బడా దోపిడీ. పొరపాటున మల్టీప్లెక్స్‌‌కు వెళ్లారో.. జేబులు ఖాళీ చేసేస్తారు జాగ్రత్త.. పరువు పోతుంది జక్కన్నా..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని చాలా మల్టీప్లెక్స్‌లు ‘బాహుబలి–ది కన్‌క్లూజన్‌’పై ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు కార్పొరేట్‌ దందాకు తెరతీశాయి. టికెట్‌తో పాటు బలవంతంగా తినుబండారాలను ప్రేక్షకుల చేతుల్లో పెట్టేలా కాంబో ఆఫర్లు రూపొం దించాయి. ఈ ఆఫర్ల

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని చాలా మల్టీప్లెక్స్‌లు ‘బాహుబలి–ది కన్‌క్లూజన్‌’పై ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు కార్పొరేట్‌ దందాకు తెరతీశాయి. టికెట్‌తో పాటు బలవంతంగా తినుబండారాలను ప్రేక్షకుల చేతుల్లో పెట్టేలా కాంబో ఆఫర్లు రూపొం దించాయి. ఈ ఆఫర్ల పేరుతో సినిమా టికెట్‌ ధరను అమాంతం 75 శాతానికిపైగా పెంచేలా భారీ స్కెచ్‌ వేశాయి. కూల్‌డ్రింక్‌ ఇష్టం లేకపోయినా, పాప్‌ కార్న్‌ నచ్చకపోయినా ఆయా థియేటర్లలో సినిమా చూడాలంటే కాంబో ఆఫర్‌ కింద టికెట్‌ కొనాల్సిందే. అలాగే ఎంట్రీ పాస్‌ల పేరుతోనూ అధిక ధరకు టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కాంబో ఆఫర్లు, ఎంట్రీ పాస్‌ల పేరిట ప్రేక్షకుల జేబుకు చిల్లు పెట్టేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని చాలా మల్టీప్లెక్స్‌లు సిద్ధమయ్యాయి.
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు బాహుబలి–ది కన్‌క్లూజన్‌. దీంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు కొందరు దళారులు, మరికొందరు మల్టీప్లెక్స్‌ నిర్వాహకులు సిద్ధమయ్యారు. కార్పొరేట్, బల్క్‌ బుకింగ్‌ పేరుతో సాధారణ ప్రేక్షకులకు అమ్మాల్సిన టికెట్లను రెట్టింపు ధరకు అమ్మేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మొదటి మూడు రోజుల పాటు కార్పొరేట్‌ షోల పేరుతో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్లన్నింటినీ బల్క్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు.

దీనికిగానూ మల్టీప్లెక్స్‌ నిర్వాహకుల వద్ద నుంచి ఫుడ్‌ కూపన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టికెట్టు ధర రూ.150 ఉంటే.. కాంబో ఆఫర్‌ పేరుతో రూ.250 నుంచి రూ.300 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆఫర్‌లో భాగంగా ఓ కోక్, పాప్‌కార్న్, ఓ సమోసా ఇస్తారు. ఇలా ఒక్కో షోలోని టికెట్లన్నీ విక్రయించడం ద్వారా లక్షలాది రూపాయలు పోగేసుకుంటున్నారు.
 
ఒక్కో టికెట్‌ను రూ.400 నుంచి రూ.450 దాకా పెట్టి కొనుక్కున్న దళారీలు వాటిని ఆకర్షణీయమైన ఎంట్రీ పాస్‌ల రూపంలో ప్రింట్‌ చేస్తున్నారు. ఈ పాస్‌లపై వివిధ సంస్థల ప్రకటనలను ముద్రించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎంట్రీ పాస్‌లను కూడా రూ.వెయ్యి వరకూ అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మొదటి మూడు రోజులు సాధారణ ప్రేక్షకుడికి టికెట్‌ దొరకడమే గగనంగా మారింది.  
 
సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 2 లేదా 4 టికెట్లను బుకింగ్‌ కౌం టర్‌ ద్వారానే అమ్మాలని నిబంధనలు ఉన్నాయి. కార్పొరేట్‌ షో వేసుకోవాలంటే నగర కమిషనర్‌ నుంచి లేదా డీసీపీ నుంచి అనుమతి తీసుకోవాలి.  అనుమతులు లేకుండానే స్పెషల్‌ షోల పేరుతో చాలా మల్టీప్లెక్స్‌ల్లో ఈ వ్యాపారం సాగుతోంది. ఈ టికెట్ల దందాపై  సంబంధిత అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.
 
చట్టాన్ని అమలు చేయడంలో అధికారుల అలసత్వం వల్లే ఇటువంటి అడ్డదారులు తొక్కుతున్నారు. కాంబో.. ఇతర ఆఫర్లను పెట్టి డబ్బులు దండుకోవడాన్ని చీటింగ్‌గానే పరిగణించాలి. ఒక వ్యక్తికిగానీ ఒక సంస్థకుగానీ టికెట్లను మొత్తంగా అమ్మవచ్చని ఎక్కడా లేదు. కాంబో ఆఫర్ల దందాలో భారీ ఎత్తున పన్ను ఎగవేత ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి.
 
ఇలా బాహుబలి సినిమాపై ఆసక్తి చూపుతున్న ప్రేక్షకులను నిలువు దోపిడీ చే్స్తే మల్టీప్లెక్స్‌లకు లాభాల పంట రావచ్చేమో కానీ బాహుబలి నిర్మాతలకు, దర్శకుడు రాజమౌళికి వ్యక్తిగతంగా ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం మెండుగానే ఉంది.