ఇకపై అగ్రహీరోల సినిమా టైటిల్స్ సీక్రెట్!
ఇప్పటివరకు ఫిలింఛాంబర్‌లో కొత్త సినిమాలు ఆరంబించాలంటే ముందుగా టైటిల్స్, నిర్మాణ సంస్థ పేర్లను రిజిష్టర్ చేసుకోవాలి. అయితే మొదటిది కాస్త తలనొప్పిగా మారింది నిర్మాతలకు. రచయిత కథ రాసి, దర్శకుడు దానికి తగిన టైటిల్ ఇది అని రిజిస్టర్ చేశాక, అది అనుకోకుండా బయటకు లీక్ కావడంతో హీరో అభిమానుల మధ్య వివాదానికి దారితీస్తుంది. ఇటీవలే ప్రముఖ హీరో టైటిల్ విషయం మీడియాలో రాగానే వెంటనే అభిమానులు ఆ హీరోకు దర్శకుడికి టైటిల్ మార్చమని ఫోన్లు చేయడం జరిగింది. దీంతో ఇదో పెద్ద సమస్యగా భావించిన నిర్మాతలు ఫిలింఛాంబర్ కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చ పెట్టారు. దాంతో వారంతా కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇకపై మీడియాకు టైటిల్స్ ఇచ్చే ప్రసక్తిలేదని తేల్చిచెప్పారు.
ఎందుకంటే ఆనవాయితీగా కొత్త సినిమా టైటిల్స్‌ను ముందుగా మీడియా అడిగితే న్యూస్ పరంగా చెప్పడం జరిగేది. అందుకే ఒకపై ఇలాంటి గొడవలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. లోతుల్లోకి వెళితే అక్కడి సిబ్బందిని కొంతమదిని ప్రలోభపెట్టి టైటిల్స్ రాబట్టడం, అగ్రహీరో సినిమాకు ఓ టైటిల్ పెట్టగానే కామ్‌గా వుంటూ ఆ హీరో సినిమా విడుదలకుముందు ఆ టైటిల్ మాదేనని మీడియా ముందు రచ్చచేయడం వంటివి న్యూసెస్‌గా మారాయి. దీనివల్ల అగ్ర హీరో నిర్మాత కొంత మొత్తాన్ని సమర్పించుకోవాల్సి వచ్చేది. అందుకే ఇకపై అలాంటివి జరగకుండా వాటికి చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.