సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జూన్ 2022 (17:18 IST)

నేను హీరోను కాదంటున్న హీరో గోపీచంద్ - పక్కా కమర్షియల్ ట్రైలర్ రిలీజ్

gopichand
హీరో గోపీచంద్ తాజాగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. నేను హీరోను కాదు విలన్ అని అంటూ రౌడీలను చితక్కొట్టడమే కాదు. మంచి టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. 
 
ఈ యాక్షన్‌ కామెడీ చిత్రం 'పక్కా కమర్షియల్‌'‌.. టైటిల్‌కు తగ్గట్టే ఈ సినిమాలో కమర్షియల్‌ హంగులన్నీ పక్కాగా ఉంటాయని చిత్ర బృందం ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. ఇప్పుడు ట్రైలర్‌ రూపంలో వాటిని అభిమానులకు అందించింది. గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రచార చిత్రం విడుదలైంది.
 
'వన్స్‌ వాడు కేసు ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లైంట్‌ అయినా బోనులో తడి గుడ్డేసుకుని కూర్చోవచ్చు' అనే ప్రారంభ డైలాగ్‌తోనే కథానాయకుడి పాత్రను ఎంత పవర్‌ఫుల్‌గా రూపొందించారో అర్థమవుతోంది. ఓవైపు యాక్షన్‌, మరోవైపు కామెడీతో గోపీచంద్‌ అదరగొట్టారు. 
 
జూనియర్‌ లాయరుగా రాశీఖన్నా కనిపించి, తనదైన మార్క్‌ నవ్వులను పంచింది. శ్రీనివాస్‌రెడ్డి, సప్తగిరి, వైవా హర్ష తమదైన శైలిలో గిలిగింతలు పెట్టించేలా ఉన్నారు. మరి లాయరైన మన హీరో రౌడీమూకతో ఎందుకు ఫైట్‌ చేయాల్సి వచ్చింది? తన కన్నతండ్రే హీరోపై ఎందుకు ఛాలెంజ్‌ చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జేక్స్‌ బెజోయ్‌ సంగీతం అందించారు. ఈ సినిమా జులై 1న విడుదలకానుంది.