గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By రామన్

మొగులయ్యకు పవన్ కళ్యాణ్ ఆత్మీయ సత్కారం

గిరిజన ప్రాంతాలకే పరిమితమైన కిన్నెర వాయిద్యంతో అద్భుతమైన గానం చేస్తూ రంజింప చేస్తున్న జానపద కళాకారుడు మొగులయ్యకు జనసేనాని పవన్ కల్యాణ్ ఆత్మీయ సత్కారం చేశారు. ఆయనకు శాలువా కప్పిన పవన్ రూ.2 లక్షల ఆర్థికసాయాన్ని అందించారు. 
 
ఈ మేరకు స్వయంగా మొగులయ్యకు చెక్ అందజేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మొగులయ్యకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం "భీమ్లానాయక్" సినిమాలో నటిస్తుండగా, టైటిల్ సాంగ్‌లో మొగులయ్య తన గాత్రాన్ని అందించిన విషయం తెల్సిందే. ఈ పాట ఇపుడు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది.
 
ఇదిలావుంటే, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సందర్భంగా సెప్టెంబ‌ర్ 2వ తేదీన ఆయ‌న కొత్త మూవీ "భీమ్లా నాయ‌క్" టైటిల్ సాంగ్‌ను మూవీ యూనిట్ విడుద‌ల చేసింది. 
 
ఆ పాటకు గాత్రాన్ని అందించింది మెట్ల కిన్నెర వాయిద్య‌కారుడు ద‌ర్శ‌నం మొగుల‌య్య‌. ఆ పాట ప్రారంభంలో వ‌చ్చే లిరిక్స్‌ను ఆయ‌న పాడి అంద‌రినీ మెప్పించాడు. ఆ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.
 
మొగుల‌య్య శ‌భాష్ భీమ్లా నాయ‌క్.. అంటూ సాగే పాట‌ను పాడ‌గా.. ఆ త‌ర్వాత కొన‌సాగింపుగా వ‌చ్చే పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్స్ శ్రీకృష్ణ‌, పృథ్వీ చంద్ర‌, రామ్ మిరియాల పాడారు.
 
ఈ నేపథ్యంలో మొగులయ్య ఆర్థిక పరిస్థితిని చూసి చలించి పోయిన పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. కిన్నెర వాద్య ప‌రిక‌రాన్నే న‌మ్ముకున్న ద‌ర్శ‌నం మొగుల‌య్య చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్య‌క్తి.
 
ఇప్ప‌టికీ ఆయ‌న‌కు రెక్కాడితే కానీ డొక్కాడ‌దు. కిన్నెర ప‌రిక‌రంతో ఊళ్లు తిరుగుతూ ఎన్ని వీర‌గాథ‌లు చెప్పినా కూడా ఎవ‌రూ ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌డం లేదు. ఆయ‌న చాలా క‌ష్టాల్లో ఉన్నార‌ని తెలుసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మొగుల‌య్య‌ను హైదరాబాద్‌కు పిలిపించి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం చెక్కును చేశారు.