గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:28 IST)

ప్రతి ఇంట్లో మా అన్నలాంటి వారు ఉంటే ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోరు : పవన్

ప్రతి ఇంట్లో తన అన్న చిరంజీవి వ్యక్తి ఉంటే పరీక్షల్లో ఫెయిల్ అయిన ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోరని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రం ప్రిరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, 'చిన్నప్పుడు ఎన్నో కథలు వింటుంటాం. ప్రతి కథలో నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం. కళ అనేది అంత అద్భుతమైనది. అనేక సందర్భాల్లో అది అనేక విధాలుగా దగ్గరవుతూ ఉంటుంది. ఈ సినిమా సైరా నరసింహారెడ్డి.. భారతదేశం తాలుకూ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా. ఎప్పుడూ భారతదేశం ఇతర దేశాలపై దాడి చేయలేదు. ప్రపంచదేశాలన్నీ వచ్చి మనమీద దాడి చేశాయి కానీ, మన దేశం మాత్రం ఏనాడూ ఇతర దేశంపై దాడి చేయలేదని గుర్తుచేశారు.
 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలాంటి వ్యక్తుల సమూహం భారతదేశం. ఆయన ఎలా ఉన్నాడో, ఎలా పోరాటం చేశాడో మనకు తెలియదు. చరిత్రను విజువలైజ్ చేసుకోగలిగే వ్యక్తులు ఒక పుస్తకం చదివితే అర్థం చేసుకోగలరు కానీ, కోట్లాది మందికి ఆ అనుభూతి రావాలంటే ఇలాంటి సినిమాలు రావాలని కోరారు. 
 
చరిత్రలో ఎంత మంది కష్టపడ్డారు. వారు దేశం కోసం ఏం చేశారు, ఎందుకు ప్రాణాలర్పించారనేది ఇలాంటి సినిమాల వల్ల తెలుస్తుంది. భగత్ ‌సింగ్, ఆజాద్, జతిన్, మహాత్మా గాంధీ, పటేల్, అంబేడ్కర్ వంటి ఎంతో మంది మహనీయుల చరిత్రలు, దేశం కోసం వారు చేసిన త్యాగం మనకు ఎంతో నేర్పిస్తాయి. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర.. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే చేసిన సినిమా కాదు. గత నాయకులు ఎంతో త్యాగం చేయబట్టే ఈ రోజు మనం ఇలా ఉన్నాం అని తెలుసుకోవాలన్నారు.
 
ఇలాంటి మహనీయుల ప్రాణత్యాగాల వల్లే మనకు ఇలాంటి ప్రజాస్వామ్యం కల్పించారు. అసువులు బాసారు. రక్తం ధారపోశారు. అలాంటి చరిత్రను అద్భుతంగా తెరకెక్కించాలంటే చాలా కష్టపడాలి. ఎంతో అద్భుతంగా ఈ చరిత్రను తెరకెక్కించిన సురేందర్ రెడ్డికి, తమ కలను అద్భుతమైన కథగా మార్చిన పరుచూరి బ్రదర్స్, మంచి డైలాగులు రాసిన సాయిమాధవ్ బుర్రాకి, ఈ చరిత్రను తెరకెక్కించడానికి కష్టపడిన సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాకు వాయిస్ చెప్పే భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను' అని పవన్ అన్నారు. 
 
అంతకుముందు తన ప్రసంగంలో తెలంగాణాలో ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల గురించి ప్రస్తావించారు. తాను కూడా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థినే అని గుర్తు చేశారు. ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు ఇంట్లో ఉన్న అన్నయ్య తుపాకీతో కాల్చుకుందామని అనుకున్నాననీ, కానీ, తన రెండో అన్న నాగబాబు, వదినమ్మ సురేఖలు తన అన్నయ్య చిరంజీవి వద్దకు తీసుకెళ్ళారని చెప్పారు. అపుడు అన్నయ్య చెప్పిన మాటలు తనను ఈ స్థాయిలో నిలబెట్టిందన్నారు. అలాగే, ప్రతి ఇంట్లో అన్నయ్య లాంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోరని పవన్ కళ్యాణ్ చెప్పారు. 
 
పైగా, తన అన్నయ్య ఏ ఒక్క వ్యక్తికి హాని చేయడని, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటారన్నారు. అలాగే, ప్రతి ఒక్కరి సినిమా హిట్ కావాలని కోరుకునే కుటుంబం తమదన్నారు. ఎందుకంటే.. ఒక సినిమా హిట్ అయితే పది మంది బాగుంటారని, అందుకే ప్రతి ఒక్క దర్శకుడు తీసే చిత్రం హిట్ కావాలని ఆకాంక్షిస్తామని పవన్ చెప్పారు.