శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (08:07 IST)

వెబ్ సిరీస్‌గా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు "హాఫ్ లయన్"

దేశంలో ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధానమంత్రి దివంగత పాములపర్తి వేంకట నరసింహారావు (పీవీ నరసింహా రావు) జీవిత చరిత్ర ఒక వెబ్ సిరీస్‌గా తెరకెక్కనుంది. బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా ఈ వెబ్ సిరీస్‌ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
ప్రధానమంత్రిగా పీవీనరసింహా రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రముఖ ఆర్థికవేత్తగా పేరుగాంచిన డాక్టర్ మన్మోహన్ సింగ్ (మాజీ ప్రధాని)ను అపుడు తన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు. దీంతో దేశ రూపురేఖలే మారిపోయాయి. 
 
దీనిపై ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి "హాఫ్ లయన్" పేరుతో భారతదేశ రూపురేఖలను పీవీ మార్చిన తీరుపై ఒక పుస్తకాన్ని రాశారు. ఇపుడీపుస్తకం ఆధారంగా అదే పేరుతో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాలని బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా సన్నాహాలు మొదలుపెట్టారు. 
 
ఈ వెబ్ సిరీస్‌ను హిందీ, తెలుగు, తమిళం భాషల్లో తెరెకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. 2023లో ప్రసారంకానున్న ఈ వెబ్ సిరీస్‌ను ఆహా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్‌లు కలిసి నిర్మిస్తున్నాయి. 
 
కాగా, భారత ప్రధానమంత్రిగా పీవీ నరసింహా రావు 1991 నుంచి 1996 వరకు కొనసాగారు. ఈ మధ్యకాలంలో అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ రూపు రేఖలను మార్చేశారు. అలాగే, 1992లో హిందూ ముస్లింల అల్లర్లకు దారితీసిన బాబ్రీ మసీదు విధ్వంసం కూడా ఆయన హయాంలోనే జరిగింది.