1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (16:33 IST)

పునీత్‌ను పరిచయం చేసింది మన పూరీ జగన్నాథే...

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ వెండితెరకు పరిచయం చేసింది టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కావడం గమనార్హం. పునీత్ రాజ్‌కుమార్ చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన కేవలం 46 ఏళ్ల వయసులో మృతి చెందడం నమ్మలేకపోతున్నారు. 
 
ఇదిలావుంటే, ఇంతటి స్టార్ డమ్ సంపాదించిన పునీత్ రాజ్ కుమార్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది మన తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ కావడం గమనార్హం. 
 
అప్పటికే బాలనటుడిగా దాదాపు 20 చిత్రాలకు పైగా నటించిన పునీత్ ఎంట్రీ కోసం.. లెజండ్రీ నటుడు, ఆయన తండ్రి రాజ్ కుమార్ సరైన కథల కోసం వెతుకుతున్నాడు. అలాంటి సమయంలో పూరీ జగన్నాథ్ చెప్పిన అప్పు కథ ఆ కుటుంబానికి బాగా నచ్చింది. వెంటనే ఆయనపై నమ్మకంతో కొడుకు ఎంట్రీని ఆయన చేతుల్లో పెట్టేశాడు. 
 
ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అప్పు సినిమాతో పూరీ సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. అదే సినిమాను తెలుగులో తర్వాత 'ఇడియట్' పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా. అప్పు తర్వాత అదే పేరుతో అభిమానులు పునీత్‌ను పిలుచుకుంటున్నారు.
 
ఇప్పటివరకు 29 సినిమాలలో నటించిన ఈయన.. దాదాపు 25 విజయాలు అందుకొన్నాడు. 90 శాతానికి పైగా సక్సెస్ రేటు.. 100 కోట్ల మార్కెట్ ఉన్న ఏకైక సౌత్ హీరో పునీత్ రాజ్ కుమార్. 
 
కర్ణాటకలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరో ఆయన. అలాంటి సూపర్ స్టార్ హఠాత్తుగా మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఆయన లేని లోటు ఎలా భర్తీ చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు అభిమానులు.