ప్రభాస్ - పూజా హెగ్డేల 'రాధేశ్యామ్' సెన్సార్ పూర్తి.. షో రన్ టైమ్ ఎంతంటే...
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన "రాధేశ్యామ్" చిత్రం ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్‌ను మంజూరుచేశారు. అలాగే, ఈ చిత్రం రన్నింగ్ టైమ్ 2 గంటల 30 నిమిషాలు (అంటే 150 నిమిషాలు).
యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం జస్టిన్ ప్రభాకర్. 1970 నాటి ప్రేమకథ. ఈ చిత్రం విడుదలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం ముమ్మరం చేసింది. ఇప్పటికే చెన్నైలో ఈ చిత్ర బృందం సందడి చేసింది. కాగా, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.