సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (13:54 IST)

నా సేవా కార్యక్రమాలకు చిరంజీవి స్ఫూర్తి : హీరో సూర్య

తమిళనాట తాను చేపట్టిన సేవా కార్యక్రమాలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవే స్ఫూర్తి అని కోలీవుడ్ హీరో సూర్య వెల్లడించారు. ఆయన నటించిన తాజా చిత్రం "ఈటీ". ఈ నెల 10వ తేదీన విడుదలవుతుంది. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ టీవీ అధినేత కళానిధి మారన్ తన సొంత నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో హీరో సూర్య మాట్లాడుతూ, తాను తెలుగు వాళ్ళలో ఒకడిగా భావిస్తున్నట్టు చెప్పారు. తెలుగు ప్రేక్షకులను కలిసి దాదాపు రెండున్నరేళ్లు అయిందన్నారు. తన ఫ్యాన్స్‌కు, ఈటీ సినిమా బృందానికి ధన్యవాదాలు అని అన్నారు.
 
స్వచ్చంధ సేవా రంగంలో మెగాస్టార్ చిరంజీవి తనకు స్ఫూర్తి అని సూర్య ఈ సందర్భంగా గుర్తుచేశారు. చిరంజీవి బ్లడ్‌‍ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవల నుంచి తాను స్ఫూర్తి పొందానని, అందుకే "అగరం" పేరిట ఓ ఫౌండేషన్‌ను స్థాపించానని చెప్పారు. ఆ ఫౌండేషన్ ద్వారా తాను సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు.