హైకోర్టు.. సుప్రీం కోర్టు డిలేస్‌తో అలసిపోయా: ఆర్జీవీ
సహజంగా ఎన్నికల సీజన్‌లలో సినిమాలు, సినీ పరిశ్రమకు సంబంధించిన వార్తలు వెనక్కు వెళ్ళిపోతాయి. ప్రతి నిముషం ఎక్కడో ఒకచోట పార్టీ ఫిరాయింపులు వంటి ఊహించని ట్విస్టులు ఉండే ఎన్నికల సీజన్‌లో.. ఏ మాత్రం ట్విస్టులు ఉండని రొటీన్ సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరు అనేది ఇప్పటి వరకు మనం చూసే ఉన్నాం.
కానీ అలాంటి పరిస్థితులని దారి మళ్లించేసి అందరి దృష్టిని ఆకర్షించేసిన ఒకే ఒక్క సినిమా రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఒక నెల నుండి.. ఇంకా చెప్పాలంటే డిసెంబర్ నుండి ప్రేక్షకులు, తెదేపా అభిమానులు అందరూ రెండు వర్గాలుగా చీలిపోయి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.
అంతగా ఎదురుచూసిన ఆ సినిమా కాస్తా... 'అ ఒక్కటి తప్ప' అన్నట్లు 'ఆంధ్రప్రదేశ్ లో తప్ప' ప్రపంచం అంతటా రిలీజ్ అయింది. దీంతో సహజంగానే రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా అప్సెట్ అయిపోయి... ట్విట్టర్ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు.
ఏప్రిల్ మూడవ తేదీన తన ట్విట్టర్ ఖాతా ద్వారా "ఏపీలో ఉన్న మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కావడంలో జాప్యం కారణంగా కోపంగా ఉన్నారా.. బాధపడుతున్నారా?" అంటూ ఒక పోల్ నిర్వహించాడు.
ఈ పోల్ కు 76% నెటిజన్లు 'అవును' అని ఓట్ వేయగా.. 24% మంది నెటిజన్లు మాత్రం 'లేదు' అని తమ స్పందనను తెలియజేసారు. ఇక కొందరు నెటిజన్లు తమ కామెంట్స్‌లో తాము ఏపీలో లేమనీ అయినా ఏపీలో విడుదల కానందుకు బాధ పడుతున్నామని కూడా చెప్పేసారు.
ఈ పోల్ సంగతి ఇలా ఉండగా... ఆర్జీవీ తాజాగా ప్రసన్న వర్మ అనే పెయింటర్ వేసిన రెండు పెయింటింగ్‌లను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసాడు. వాటిలో... మెడలో సంకెళ్లతో ఉన్న కోతి పెయింటింగ్‌కి "నేను ఈ హైకోర్టు.. సుప్రీం కోర్టుల ఆలస్యంతో తీవ్రంగా అలసిపోయాను" అనే కామెంట్ పెట్టగా... గాయాలతో ఉన్న పిల్లకోతిని అక్కున చేర్చుకొని ఓదారుస్తున్న తల్లి కోతి పెయింటింగ్‌కి క్యాప్షన్‌గా... 'అమ్మ' అర్జీవీ.. బిడ్డ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను ఓదారుస్తూ ఉందని చెప్తూ పెయింటర్‌ను ఒక 'విజనరీ' అంటూ ఆకాశానికెత్తేసాడు. మొత్తం మీద లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల వాయిదాతో విసిగిపోయానని ఈ విధంగా చెప్పేస్తున్నాడు వర్మ.