ఆదివారం, 3 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 మే 2023 (18:27 IST)

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి

music director raj
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి‌లోని సంగీత దర్శకుడు రాజ్ ఇకలేరు. ఆయన ఆదివారం హైదరాబాద్ నగరంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని తన నివాసంలోనే ఆయన కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు తోటకూర సోమవారం. మరో సంగీత దర్శకుడు కోటితో కలిసి రాజ్- కోటిగా అవతరించి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సూపర్ హిట్ సంగీతాన్ని అదించారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 
 
సంగీత ప్రపంచంలో రాజ్‌-కోటి ద్వయం ప్రఖ్యాతిగాంచింది. దశాబ్దాలపాటు ఈ ద్వయం సినీప్రియులను తమ సంగీతంతో అలరించింది. రాజ్‌ మరణంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు సంతాపం ప్రకటించారు. రాజ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
రాజ్‌-కోటి ద్వయం ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించింది. దాదాపు 150కు పైగా చిత్రాలకు వీరు పనిచేశారు. 'ముఠామేస్త్రి', 'బావా బావమరిది', 'గోవిందా గోవిందా' 'హలోబ్రదర్‌' వంటి చిత్రాలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అనుకోని కారణాల వల్ల కోటి నుంచి విడిపోయిన రాజ్‌ సొంతంగా కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు. 'సిసింద్రీ', 'రాముడొచ్చాడు', 'ప్రేమంటే ఇదేరా' ఇలా తదితర సినిమాలకు ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. కొన్ని సినిమాల్లోనూ ఆయన అతిథి పాత్రల్లో కనిపించారు.