ఓటుకు నోటు వద్దు... భవిష్యత్ అందించే వారే ముద్దు...
“సెలెబ్రెటీలు చెబితేనో.. సినిమాలలో సందేశాలు ఇవ్వటం వల్లనో జనాలు మారతారు అనుకోవటం భ్రమ. అలా అనుకుంటే ఎన్ని సినిమాలు మంచి సందేశాలు ఇవ్వలేదు.. ఎంతమంది సెలబ్రెటీలు మంచి కారణం కోసం ప్రచారం చేయలేదు. ఎవరో చెబితే జనాలు మారటం జరగదు. వారంతట వారిలో మార్పు రావాలి” అన్నారు నటుడు సంపూర్ణేష్ బాబు. తాను నటించగా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకున్న మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటిటి వేదిక సోనీ లివ్‌లో ప్రసారమవుతుంది. దీనికి అపూర్వ స్పందన లభిస్తుండటం విశేషం. ఓటుకు నోటు నేపధ్యంలో సాగే ఈ చిత్రం వర్తమాన రాజకీయాలపై వ్యంగ్య చిత్రంగా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగటంతో ఓటర్లలో చాలా మంది తమను తాము ఈ చిత్రం లోని ప్రధాన పాత్రలలో తమను తాము ఊహించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సంపూర్ణేష్ బాబును ఓటర్లకు ఏమి చెప్పాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు పై వ్యాఖ్యలు చేశారు. తమకు మంచి జరగాలనుకుంటే మంచి వారిని ఎన్నుకోవాలన్న ఆయన, ఎవరి అవసరాలు వారికి వుంటాయి, దానిని తప్పు పట్టలేము కానీ, మన భవిష్యత్‌ను నిర్ణయించుకునే అవకాశం వచ్చినప్పుడు మాత్రం దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటు తప్పనిసరిగా వేయాలన్న ఆయన, ఓటును మాత్రం వ్యర్థం చేయవద్దని పిలుపునిచ్చారు. ఓటు ప్రాధాన్యతను తమ మార్టిన్ లూథర్ కింగ్‌లో వినోదాత్మకంగానే అయినా సందేశాత్మకంగా చెప్పామన్న ఆయన, ఇప్పుడు దీనిని మీ ఇంటిలోనే చూడవచ్చన్నారు. తన ఓటును వ్యర్థం చేయటం లేదని, ఓటు వేయటం కోసమే తాను ఊరికి వెళ్లానని చెప్పారు.
ఓటిటిలు తమ లాంటి చిన్న చిత్రాల నాయకులకు, నేరుగా ప్రజలు ఇళ్లకు చేరే అవకాశం కల్పిస్తున్నాయంటూ, తన గత చిత్రాలు ఓటిటిలలో చక్కటి వ్యూయర్‌షిప్ సొంతం చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ కూడా సోని లివ్‌లో అదే తరహా ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తాను నటించిన 'సోదరా' చిత్రం విడుదల కానుందన్న ఆయన ఇది కూడ వినోదభరిత చిత్రమేనని ఈ సందర్భంగా వెల్లడించారు.