ఆఫ్ఘనిస్థాన్‌లో సంపూర్ణ ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ - స్తంభించిన సేవలు
తాలిబన్ పాలిత దేశమైన ఆప్ఘనిస్థాన్‌లో సంపూర్ణ ఇంటర్నెట్ బ్లాక్ అవుట్‌ను అమలు చేస్తున్నారు. అనైతిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా తాలిబన్ పాలకులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా, అశ్లీలతపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. తాలిబన్ పాలకులు తీసుకున్న కఠిన నిర్ణయం కారణంగా 4.3 కోట్ల మందికి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే, దేశంలో 3జీ, 4జీ సేవలు కూడా రద్దు కాగా, ప్రస్తుతం కేవలం 2జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ బ్లాకౌట్ ప్రభావం కారణంగా విమాన, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది.
తాలిబన్ పాలనలో దేశ వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థను ఇలా పూర్తిగా మూసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నట్ వాచ్‌డాగ్ సంస్థ కూడా నెట్‌బ్లాక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. సోమవారం దశలవారీగా అనేక నెట్‌వర్క్‌లను నిలిపివేశారని, చివరకు టెలిఫోన్ సేవలను కూడా నిలిపివేయడంతో ఇది సంపూర్ణ ఇంటర్నెట్ బ్లాక్ అవుట్‌గా మారిందని పేర్కొన్నారు. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే ఫోన్ కాల్స్ కూడా పనిచేస్తుండటంతో ఇంటర్నెట్‌తో పాటు అన్ని కూడా మూగబోయినట్టు ఆ సంస్థ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలోని 3జీ, 4జీ సేవలను వారం రోజుల్లోగా నిలిపివేయాలని, కేవలం 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశించినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కారణంగా ఆ దేశ రాజధాని కాబూల్, హెరాత్, కాందహార్ వంటి ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ వినయోగం అత్యంత తీవ్రంగా పడిపోయినట్టు క్లౌడ్‌ఫ్లేర్ అనే సంస్థ తెలిపింది. ఈ బ్లాక్ ఔట్ తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు కొనసాగుతుందని, సుమారు 8 నుంచి 9 వేల టెలీకమ్యూనికేషన్స్ టవర్లను మూసివేస్తున్నామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపినట్టు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.