కంగనాపై దేశ ద్రోహం కేసు : ఎందుకు చిత్రవధ చేస్తున్నారు?
బాలీవుడ్ వివాదస్పద నటి కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసం ఆమె శుక్రవారం ముంబైలోని బాంద్రా పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. నటి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. మధ్యాహ్నం ఒటి గంటకు ఆమె తన సోదరితో కలిసి వచ్చారు. ఆ ఇద్దరికీ వై ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పించారు.
గత అక్టోబర్‌లో కంగనా చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. రెండు వర్గాల మధ్య చిచ్చుకు దారి తీసేలా ఆ ట్వీట్ ఉన్నట్లు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలీ చండేల్‌పై కేసు బుక్కైంది.
బాంద్రాలోని మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా కంగనా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతో.. ఆమెపై విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
ఆతర్వాత ఆమె ట్విట్టర్‌లో భావోద్వేగభరితంగా స్పందించారు. తనను ఎందుకు చిత్రవధకు గురిచేస్తున్నారంటూ ప్రశ్నించారు. "మానసికంగా, భావోద్వేగాల పరంగా, భౌతికంగా ఎందుకు హింసిస్తున్నారు? ఈ దేశం నుంచి నేను జవాబులు తెలుకోవాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను మీ పక్షాన నిలిచాను, ఇప్పుడు మీరు నాకు మద్దతుగా నిలివాల్సిన సమయం వచ్చింది.. జైహింద్" అంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
కాగా, బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కంగనా తన గళాన్ని బలంగా వినిపించారు. ఇండస్ట్రీలో చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఆమెకు, ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముంబయిలోని ఆమె కార్యాలయాన్ని అధికారులు పాక్షికంగా కూల్చివేయడం జరిగింది. కొందరు నేతలకు, కంగనాకు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా నడిచాయి.