ఆదాయ అర్జనలో అక్షయ్ టాప్ : ఆరేళ్ళలో రూ.1700 కోట్లు
బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ మరోమారు వార్తలకెక్కారు. కరోనా కష్టకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన పీఎం కేర్ ఫండ్‌కు ఏకంగా రూ.25 కోట్లను విరాళంగా ఇచ్చారు. దీనిపై ఆయన భార్య అభ్యంతరం చెప్పినా... ఏమాత్రం లెక్కచేయలేదు. ఈ క్రమంలో తాజాగా ఆయన మరోమారు వార్తల్లో నిలిచారు. ఆదాయ అర్జనలో అగ్రస్థానంలో నిలిచారు. గత ఆరేళ్ళ కాలంలో ఏకంగా 1744 కోట్ల రూపాయలను అర్జించినట్టు వెల్లడైంది. ఒక్క 2019 సంవత్సరంలోనే ఆరు సినిమాలతోపాటు ప్రమోషన్ల ద్వారా రూ.459.22 కోట్ల సంపాదించినట్టు ఫోర్స్బ్ పత్రిక వెల్లడించింది.
నిజానికి బాలీవుడ్‌లోని సీనియర్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఒక ఏడాదికి దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తున్నాడు. ఒక్కో సినిమాకు రూ.వంద కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తూ అదే రేంజ్‌లో సంపాదిస్తున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే అక్షయ్ సంపాదన భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గత ఆరేళ్లలో అక్షయ్ భారీగా ఆర్జించినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది.
ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం.. గత 6 సంవత్సరాలలో అక్షయ్ సంపాదన దాదాపు రూ.1,744 కోట్లు అని తేలింది. ఇందులో 2015లో రూ.208.42 కోట్లు, 2016లో రూ.211.58 కోట్లు, 2017లో రూ.231.06 కోట్లు, 2018లో రూ.277.06 కోట్లు, 2019లో రూ.459.22 కోట్లు, 2020లో రూ.356.57 కోట్లు చొప్పున అర్జించినట్టు ఆ పత్రిక అంచనా వేసింది. ఇకపోతే, ప్రస్తుతం అక్షయ్ చేతిలో ఏడు చిత్రాలు ఉన్నాయి.