సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (23:02 IST)

శర్వానంద్ నాకు మరో రామ్ చరణ్: మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi at Srikaram pre-release
శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా న‌టించిన సినిమా శ్రీకారం. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఈనెల 11న విడుద‌ల‌కానుంది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా సోమ‌వారం రాత్రి ఖ‌మ్మంలో ప్రీరిలీజ్ వేడుక నిర్వ‌హించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు. శ్రీ‌కారం బిగ్ టికెట్‌ని ఆవిష్క‌రించారు.
 
అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ప్రజాంకిత యాత్ర పేరుతో నేను ఈ ఖమ్మంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఎక్కడా లభించని అనూహ్య స్పందన నాకు ఈ ఖమ్మంలో లభించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత దారి పొడవునా నాకు నీరాజనాలు పలికారు. ఆ ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఇప్పుడు కూడా అంతే ఆదరణ లభించింది. మంత్రి పువ్వాడ అజయ్ ఒక సోదరుడిలా మాకు ఆతిథ్యాన్ని ఇస్తూ సహకరిస్తున్నారు.

ఆచార్య షూటింగ్ అజయ్ వల్లే సజావుగా సాగుతోంది. శ్రీకారం విషయానికి వస్తే, చరణ్ ఫోన్ చేసి శర్వానంద్ సినిమాకు ముఖ్య అతిథిగా వెళ్లాలని చెప్పాడు. నాకోసం వాళ్లు ఖమ్మం జిల్లాకు వచ్చారు. నేను ఈ కార్యక్రమానికి రావడానికి నిర్మాతలు రామ్, గోపీ కారణం అయితే మరో ముఖ్య కారణం శర్వానంద్. అతను చిన్నప్పటి నుంచి రామ్ చరణ్‌తో కలిసి పెరిగాడు. శర్వానంద్ నాకు మరో రామ్ చరణ్ లాంటివాడు.

నేను, శర్వా కలిసి థమ్సప్ యాడ్ చేశాం. తను ఫస్ట్ స్క్రీన్ మీద కనిపించింది అదే. ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో సింపతీ ఉన్న క్యారెక్టర్ కోసం శర్వానంద్‌ను అడిగితే ‘మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా చేస్తాను’ అని చేశాడు. తన నటనకు శ్రీకారం చుట్టింది అక్కడే. సినిమా సినిమాకు పరిణతి సాధిస్తూ సక్సెస్ అందుకుంటూ శ్రీకారం సినిమాతో అత్యద్భుత నటనతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు.

Chiru, Sharvanand
డైరెక్టర్ కిషోర్ ఈ సినిమాను మంచి కమర్షియల్‌గా రూపొందించాడు. వ్యవసాయం గురించి చెప్పాలన్న ప్రయత్నంతో 4 ఏళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన నిర్మాతలు దీన్ని పెద్ద సినిమాగా చేయాలని భావించి శ్రీకారం చేశారు. బుర్రా సాయిమాధవ్ డైలాగులు అత్యద్భుతంగా ఉన్నాయి. ఎంతోమంది ఐటీ కుర్రాళ్లు లక్షల్లో జీతం వదులుకుని నేల తల్లి మీద మమకారంతో సొంతూళ్లో వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయాన్ని టెక్నాలజీ సాయంతో చేస్తూ అభివృద్ధి చెందుతున్నారు. మామూలుగా ఒక నటుడి కొడుకు నటుడు అవ్వాలనుకుంటాడు.. పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్అవ్వాలను కుంటాడు. కానీ ఒకరైతు కొడుకు రైతు అవ్వాలనుకోడు. అది మన ఖర్మ.

కానీ రైతు కొడుకు రైతు అవ్వాలి. నేను రైతుని అని గర్వంగా చెప్పుకోవాలి. అలాంటి రోజు మళ్లీ రావాలి. వస్తుందనే ఆశ నాకు ఉంది. వ్యవసాయానికి అధునాతన పద్ధతులు జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. రైతు బిడ్డలు అంతా చదువుకుని మోడ్రన్ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి. అలా చేయగలిగితే రైతే రాజు. మనది వ్యవసాయ ఆధారిత దేశం. అలాంటిది ఇప్పుడు వ్యవసాయానికి అందరూ దూరం అవుతున్నారు. రైతు కొడుకు రైతుగా డెవలప్ అయిన రోజే దేశానికి గర్వకారణం అయిన పౌరుడు అవుతారు. శ్రీకారం సినిమాలో అదే విషయం చెప్పారు. అన్ని కమర్షియల్ హంగులతో సినిమా చాలా బాగా చేశారు. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలి.’’ అన్నారు.