ఎస్బీబీ ఆరోగ్యం మెరుగుపడుతోంది.. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ఆరోగ్య బులిటెన్‌ను విడుదల చేశారు.
ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స కొనసాగుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఎస్పీబీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యులు అడిగిన దానికి స్పందిస్తున్నారని చెప్పారు. ఫిజియోథెరపీ చికిత్స కూడా కొనసాగుతోందని, నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వివరించింది.
ఎస్పీబీ తనయుడు చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం నిన్నటితో పోలిస్తే ఈ రోజు మరింత మెరుగైనట్టు చెప్పారు. వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తన తండ్రి కోలుకోవాలని అందరూ చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చరణ్ పేర్కొన్నారు.