శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (13:14 IST)

చెన్నైలో ఓ వీధికి గానగంధర్వుడి పేరు : సీఎం స్టాలిన్ ఆదేశాలు

spbalu
గానగంధర్వుడు దివంగత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోనుంచి చెన్నై మహానగరంలోని ఓ వీధికి ఆయన పేరును పెట్టారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగో వర్థంతి వేడుకలు సెప్టెంబరు 25తేదీ బుధవారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఎస్పీబీ జీవించివున్న సమయంలో స్థానిక నుంగంబాక్కంలోని కామ్‌ధర్ నగర్‌లో ఉండేవారు. 
 
తన తండ్రి స్మారకార్థం ఎస్బీబీ ఇల్లు ఉన్న వీధి పేరుకు ఎస్పీబీ నగర్ లేదా ఎస్పీబీ వీధిగా నామకరణం చేయాలంటూ ఆయన తనయుడు ఎస్పీబీ చరణ్ ఇటీవల సీఎం కార్యాలయానికి ఓ వినతిపత్రం సమర్పించారు. దీన్ని పరిశీలించిన సీఎం స్టాలిన్ గురువారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. 
 
కాగా, ఎస్పీబీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠా తదితర భాషల్లో వేలాది పాటలు పాడిన విషయం తెల్సిందే. గత 2020లో ఆయన కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కాగా ఎస్పీబీకి కేంద్రం 2001లో0 పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, 2021లో మరణాంతరం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసిన విషయం తెల్సిందే.