శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 26 మే 2020 (21:18 IST)

14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతాఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున ప‌డ్డారు. ముఖ్యంగా టాలీవుడ్లో వేలాది మంది సంఘ‌టిత అసంఘ‌టిత సినీ కార్మికులు తిండికి లేక ఇబ్బంది ప‌డుతున్నార‌న్న గ‌ణాంకాల్ని ఇటీవ‌ల సినీపెద్ద‌లు గుర్తించారు.
 
మెగాస్టార్ చిరంజీవి క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) పేరుతో సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాల సాయం చేసిన సంగ‌తి తెలిసిందే. సీసీసీ సాయంపై ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా అన్ని వ‌ర్గాల‌నుంచి ప్ర‌శంస‌లు కురిసాయి. ఇదే కోవ‌లో సినీ-టీవీ కార్మికుల సాయం కోసం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ముందు‌కొచ్చారు.
 
తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న‌ దాదాపు 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం అందించేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్దం చేశారు. ఈ సేవా కార్య‌క్ర‌మం గురువారం నుంచి ప్రారంభం కానుంది. సినీ, టీవీ కార్మికుల క‌ష్టాల‌పై త‌ల‌సాని ఇటీవ‌ల సినీపెద్ద‌ల స‌మావేశంలోనూ ఆరా తీసి నిత్యావ‌స‌రాల్ని సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఇత‌ర రంగాల‌తో పోలిస్తే సినీ రంగంపైనే అధికంగా ప‌డింది.
 
టాలీవుడ్లో దినసరి కార్మికుల‌కు జీత భ‌త్యాలు లేక అల్లాడుతున్నారు. అవ‌స‌రం మేర పెద్ద‌ల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకుని త‌న‌కు తానుగానే ఈ సేవాకార్య‌క్ర‌మానికి త‌ల‌సాని ట్ర‌స్ట్ ద్వారా నిత్యావసర సరుకులను ఇవ్వడానికి శ్రీ‌కారం చుడుతున్నారు. గురువారం మొద‌లు నిత్యం 14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు అందే వరకు ఈ సేవా కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంద‌ని సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ వెల్ల‌డించారు.