నా జీవన గమనానికి దిశా నిర్దేశం శాస్త్రిగారే: ఎస్.ఎస్. రాజమౌళి, ఇంకా ఎవరేమన్నారు?
నా జీవన గమనానికి దిశా నిర్దేశం శాస్త్రిగారేనని ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి పేర్కొన్నారు. సీతారామశాస్త్రిగారి మరణం పట్ల ఆయన తీవ్ర బాధను వ్యక్తం చేస్తూ ఆయనతో తనకు గల పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆర్.ఆర్.ఆర్.లో దోస్తీ మ్యూజిక్ వీడియోకి లిరిక్ పేపర్‌లో ఆయన సంతకం చేసే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించాం. కానీ అప్పటికే ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. ఇది మర్చిపోలేని జ్ఞాపకం అంటూ వెల్లడించారు.
సింహాద్రిలో `అమ్మయినా నాన్నయినా, లేకుంటే ఎవరైనా` పాట మర్యాద రామన్నలో `పరుగులు తీయ్` పాట, ఆయనకు చాలా ఇష్టం. అమ్మ నాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవటం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము. నంది అని తిట్టి, మళ్ళీ ఆయనే `ఐ లైక్ దీస్ ఛాలెంజెస్` అంటూ మొదలు పెట్టారు. కలిసినప్పుడల్లా ప్రతీ లైన్ నెమరువేసుకుంటూ, అర్థాన్ని మళ్ళీ విపులీకరించి చెప్తూ, ఆయన శైలిలో గది దద్దరిల్లేలా నవ్వుతూ, పక్కనే వుంటే వీపుని గట్టిగా చరుస్తూ ఆనందించేవారు.
1996లో మేము అర్థాంగి అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి. అలాంటి స్థితిలో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్ను తట్టి ముందుకు నడిపించినవి- ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులు కోవద్దురా ఓరిమి` అన్న సీతారామశాస్త్రిగారి పదాలు.. భయం వేసినప్పుడల్లా గుర్తు తెచ్చుకుని పాడుకుంటే ఎక్కడలేని ధైర్యం వచ్చేది.
ఆ తర్వాత 31 డిసెంబర్ రాత్రి మీ చేతుల్తో ఓ పాట రాయమని నోట్‌బుక్ ఇస్తే రాసి, సంతకం చేశారు. దాన్ని మా నాన్నగారికి ఇస్తే ఆయన కళ్ళలో ఆనందం మాటల్లో చెప్పలేను.. అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు రాజమౌళి.