మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (19:16 IST)

వారికి నా పాట‌ల‌పై మంచి సెంటిమెంట్ ఉంది : వరంగల్ శ్రీనివాస్

Warangal Srinivas
Warangal Srinivas
తెలుగు సినిమా ఓ అందమైన పూలతోట అయితే.. ఆ పూదోటలో పెరిగిన పాటల చెట్టుకు రంగు రంగుల పూలిస్తున్నాడు. ఆయన కలంలో అన్ని రసాలు కలగలిపిన సిరా ఉంటుందేమో అన్న‌ట్టుగా.. ఏ భావాన్నైనా, ఏ సంద‌ర్భాన్నైనా పాట‌గా అల్లుతాడు. గుండెకు హత్తుకునేలా రాసి ఎక్కడికో తీసుకెళ్తాడు. మ‌ళ్లీ మ‌ళ్లీ వినేలా త‌న‌ పాట‌తో మ‌న‌ల్ని ప‌ర‌వశింప‌జేస్తాడు. పాట‌ల రచ‌యిత‌, గాయ‌కుడు, న‌టుడు వరంగల్ శ్రీనివాస్ 'తారకాసురుడు' చిత్రంతో సంగీత ద‌ర్శ‌కునిగా ప్ర‌స్థానం మొద‌లుపెడుతున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు.
 
మ‌ల్టీటాలెంట్ చూపిస్తున్న మీరు 'తారకాసురుడు' చిత్రంతో సంగీత ద‌ర్శ‌కునిగా కూడా మారుతున్నారు. ఈ క్ర‌మం వివ‌రిస్తారా.?
ద‌ర్శ‌క‌ర‌త్న దాసరి నారాయణ రావు ప్రొత్సాహంతో నేను సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాను. నా ప్ర‌తిభ‌ను గుర్తించి సినీ రచయితగా నాకు తొలి అవ‌కాశం ఇచ్చారు. ''వీడు నా బిడ్డ‌.. వీడి పొట్ట నిండా పాట‌లే..'' అని దాస‌రి న‌న్ను అనే వారు. దర్శకుడు వి. స‌ముద్ర కూడా దాస‌రి శిష్యుడే. తాజాగా వి.స‌ముద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ 'తారకాసురుడు' చిత్రంతో ఆయ‌న న‌న్ను సంగీత ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. దాస‌రి త‌రహాలోనే వి. స‌ముద్ర ద‌గ్గ‌ర‌ ప‌ని చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. చిన్న‌ప్ప‌టి నుంచి ప్ర‌కృతి ఒడిలో పెరిగిన నాకు ప‌ల్లెటూళ్ల‌లో ఎన్నో పాట‌లు వినేవాడిని. వాళ్లు సంగీతం నేర్చుకోక‌పోయినా అద్భుతంగా పాడుతారు. మ‌ట్టిలో ముట్టుకుంటే పాట వ‌స్తుంది. ఆ క్ర‌మంలో నేను అమ్మ పాట ఒడిలో పెరిగాను. అలా న‌న్ను సంగీత ద‌ర్శ‌కున్ని చేసింది కూడా అమ్మ పాటే. ఈ విష‌యాన్ని గ‌ర్వంగా చెప్పుకుంటాను.  
 
 మీ నేప‌థ్యం ?
మాది వరంగల్ జిల్లా తక్కెళ్లపాడు గ్రామం. ప్ర‌కృతి ఒడిలో, పాటల పూదోట‌లో పెరిగాను. మా అమ్మ, మా మేనత్తలు కూడా జానపదాలను చక్కగా ఆలపించేవారు. దుక్కి దున్నేటప్పుడూ, నారు పోసేటప్పుడూ, వడ్లు దంచేటప్పుడూ, తిరగలి తిప్పేటప్పుడూ జోల పాడేటప్పుడు.. ఇలా పని జరుగుతున్న ప్రతి చోటా ఊళ్లో పాటలు వినే వాడిని. వాళ్లతో పాటు గొంతు కలిపేవాడిని. అలాంటి వాతావరణంలో పెరిగాను. అలా పాట అనేది నా జీవితంలో భాగం అయిపోయింది.
 
ఎప్ప‌టి నుంచి సొంతంగా పాట‌లు రాయ‌డం, పాడ‌టం మొద‌లుపెట్టారు?
 ఏడోతరగతిలోనే సొంతంగా పాట రాశాను. రాసిన తొలి పాటకే ప్రథమ బహుమతి వచ్చింది. అప్పట్నుంచి నా రచనా ప్రస్థానం మొదలైంది. పల్లె జానపదాల బాణీలను తీసుకొని ప్రస్తుత సమస్యలపై సొంతంగా పాటలు రాశాను. అలా 93 అణగారిన జాతులపై పాటలు రాశాను. కమ్యూనిస్ట్, మావోయిస్ట్, సోషలిస్ట్... ప్రజాకళాల‌ను ఆక‌లింపు చేసుకున్నాను.
 
ఎన్నిభాష‌ల్లో పాట‌లు రాశారు?
తెలుగు మాత్ర‌మే కాదు నాకు ఇత‌ర భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. బెంగాలీ, అస్సామీ, ఒరియా, లంబాడీ, కోయ, గొండు.. ఇలా ప‌లు భాషల్లో ఎన్నో పాటలు రాయడమే కాదు, సొంతంగా పాడాను కూడా.
 
సినీ గీతరచయితగా మీరు ఎక్కువ పేరు పొందిన పాట‌లు చెబుతారా?
సినీ రచయితగా తొలి అడుగు వేసింది దాసరి నారాయణ రావు చిత్రం ద్వారానే. ‘అడవి చుక్క’ చిత్రంలో ‘తయ్యుందత్తై.. తయ్యుందత్తై నేను రాసిన తొలి పాట. అదే సినిమాలో అతడు రాసిన ‘ఎవరు అన్నారమ్మ మేమూ... గరీబోళ్లనీ’ పాటైతే పెద్ద హిట్. అలాగే దాసరి ‘చిన్నా’ చిత్రంలో నేను రాసిన ‘గువ్వా గువ్వా ఎగిరేటి గువ్వా ఏడికే సిరిసిరి మువ్వా’ పాట విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆర్.నారాయణమూర్తి కూడా ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చలో అసెంబ్లీ, వేగుచుక్కలు, ఊరు మనదిరా, అడవిబిడ్డలు, వీరతెలంగాణ, పోరు తెలంగాణ, అమ్మమీద ఒట్టు సినిమాలతో పాటు ‘నిర్భయభారతం’ చిత్రానికి కూడా పాటలు రాశాను. ఇందులో అడవిబిడ్డలు, వీరతెలంగాణ.. వంటి సినిమాల్లో నటించాను కూడా. ఎర్ర సినిమాలే కాక, ఫూల్స్, ఆయుధం, ఈ వయసులో, రెండేళ్ల తర్వాత, రఘుపతి లాంటి వాణిజ్య సినిమాల‌కు కూడా పాటలు రాశాను.
 
పాట‌ల్లో మీరు చేస్తున్న‌ ప్ర‌యోగాలు చెబుతారా?
వ‌చ్చే జ‌న‌రేష‌న్ వాళ్ల‌కు కూడా న‌చ్చేలా నా బాణీల‌ను సిద్ధం చేసుకోవ‌డం నాకు అల‌వాటు. ఇక గ‌తంలో నేను చేసిన‌ ఉద్య‌మ పాట‌లు కూడా నాకు మంచి పేరు తీసుకువ‌చ్చాయి. నేను పాట‌లు ఇచ్చిన రాజ‌కీయ నాయ‌కులు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డంతో వారికి నా పాట‌ల‌పై మంచి సెంటిమెంట్ ఉంది. అదే క్ర‌మం సినిమాల్లోనూ క‌నిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు సంగీత ద‌ర్శ‌కునిగా కూడా 'తారకాసురుడు' చిత్రం కోసం పాట‌ల‌కు ప్ర‌యోగాలు చేశాను. ఈ సినిమా పాట‌లు కూడా మంచి హిట్టు అవుతాయ‌ని న‌మ్మ‌కం ఉంది.