సోమవారం, 11 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (11:10 IST)

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు పి.సి. రెడ్డి క‌న్నుమూత‌

PC reddy-Krshanmraju and others
తెలుగు ద‌ర్శ‌కుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు పొందిన ద‌ర్శ‌కుడు పి. చంద్ర శేఖర్ రెడ్డి (పి.సి.రెడ్డి) సోమ‌వారంనాడు మ‌ర‌ణించారు. ఈరోజు ఉద‌యం చెన్నైలో 8.30 నిముషాల‌కు మ‌ర‌ణించారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. చంద్ర శేఖర్ రెడ్డి తన సినీ కెరీర్లో సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటివారితో పని చేశారు. అంతేకాదు నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కృష్ణ చిత్రాలకు ఎక్కువగా దర్శకత్వం వహించారు. ఆయన కన్నుమూసిన విషయం తెలిసిన సినీ ప్రముఖులు పి.సి.రెడ్డికి సంతాపం తెలియజేస్తున్నారు.
 
 
పి.సి.రెడ్డిగా చిత్రసీమలో పేరొందిన ఆయన పూర్తి పేరు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి. నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం పేటలో 1933 అక్టోబర్ 14న జన్మించారు. 1971లో కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందిన ‘అనూరాధ’ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు పి.సి.రెడ్డి. ‘అత్తలూ-కోడళ్ళు’, ‘విచిత్ర దాంపత్యం’, ‘ఇల్లు-ఇల్లాలు’, ‘బడిపంతులు’, ‘తాండవ కృష్ణుడు’, ‘మానవుడు-దానవుడు’, ‘నాయుడుబావ’, ‘మానవుడు-మహనీయుడు’, ‘పుట్టింటి గౌరవం’, ‘ఒకే రక్తం’, ‘రాముడు-రంగడు’, ‘జగ్గు’, కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో “అత్తలు- కోడళ్ళు, అనూరాధ, ఇల్లు-ఇల్లాలు, తల్లీకొడుకులు, మమత, స్నేహబంధం, గౌరి, పెద్దలు మారాలి, కొత్తకాపురం, సౌభాగ్యవతి, పాడిపంటలు, జన్మజన్మల బంధం, పట్నవాసం, ముత్తయిదువ, భోగభాగ్యాలు, పగబట్టిన సింహం, బంగారుభూమి, పులిజూదం, నా పిలుపే ప్రభంజనం, ముద్దుబిడ్డ” చిత్రాలు రూపొందాయి. కృష్ణ హీరోగా మొత్తం 20 చిత్రాలు తెరకెక్కించారు పి.సి.రెడ్డి. ఆయన వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య, పి.యన్.రామచంద్రరావు, శరత్, వై. నాగేశ్వరరావు వంటివారు దర్శకులుగా రాణించారు. కృష్ణ‌కు ల‌క్కీ డైరెక్ట‌ర్ గా పేరు సంపాదించిన పి.సి.రెడ్డి, న‌ట‌ర‌త్న య‌న్టీఆర్ తో చేసిన ఏకైక‌చిత్రం బ‌డిపంతులు. పి.సి.రెడ్డి చివ‌రి చిత్రం జ‌గ‌న్నాయ‌కుడు (2014).