1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 మే 2024 (12:25 IST)

చెప్పులు వేసుకోవడం మానేసిన కోలీవుడ్ హీరో!

Vijay Antony
కోలీవుడ్ హీరో ఒకరు చెప్పులు వేసుకోవడం మానేశారు. ఆయన ఎవరో కాదు.. విజయ్ ఆంటోనీ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయనకు తెలుగు చిత్రపరిశ్రమలోనూ మంచి పేరుంది. బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో పైకి ఎదిగారు. తాజాగా తుఫానుతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చెప్పులు వేసుకోకపోవడానికి గల కారణాన్ని వివరించారు. 
 
'నేను మూడు నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. ఏదో దీక్ష చేస్తున్నానని అందరూ అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. ఒకరోజు చెప్పులు లేకుండా నడిచాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిది. మనపై మనకు నమ్మకాన్ని పెరుగుతుంది. చెప్పులు లేకుండా తిరుగుతున్నప్పటి నుంచి ఒత్తిడికి గురికాలేదు. అందుకే జీవితమంతా చెప్పులు వేసుకోకూడదని అనుకున్నా' అని విజయ్‌ ఆంటోని చెప్పుకొచ్చారు. ఇక 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్‌ కూడా చెప్పులు వేసుకోరనే విషయం తెలిసిందే. తనకు చెప్పులు వేసుకొని నడవడం ఇష్టం ఉండదని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు.
 
మరోవైపు, విజయ్‌ ఆంటోని హీరోగా శశి తెరకెక్కించిన చిత్రం 'పిచ్చైకారన్‌'. 'బిచ్చగాడు' పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడా ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన 'బిచ్చగాడు-2' దానికి మించిన సక్సెస్‌ అందుకుంది. దీంతో పార్ట్‌-3 కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో విజయ్‌ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘బిచ్చగాడు 3’ ఖచ్చితంగా ఉంటుందన్నారు. 2026 వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తామని తెలిపారు.