కోట్లాది మంది యువతకి చిరంజీవి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ
చిత్ర పరిశ్రమలోనే కాకుండా కోట్లాది మంది యువతకు మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. అలాంటి నటుడి చిత్రాలు పరాజయం పాలైనప్పుడు విమర్శించడం తగదని హితవు పలికారు. సరైన దర్శకుడు, మంచి కథ కుదిరితే అగ్ర నటులు తమ సత్తా ఏంటో చూపిస్తారని వ్యాఖ్యానించారు. ఇందుకు రజినీకాంత్ నటించిన "జైలర్" చిత్రం ఉదాహారణ అని పేర్కొన్నారు.
వరుస పరాజయాలు వచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చిత్ర పరిశ్రమ భవిష్యత్ కోసం కష్టపడుతూనే ఉన్నారన్నారు. తన తాజా చిత్రం 'ఖుషి' ప్రచారంలో భాగంగా చెన్నైలో విజయ్ దేవరకొండ పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఎన్‌వీఎస్ ప్రసాద్, ఆర్‌బీ చౌదరిలతో కలిసి తెలుగు అగ్రహీరోలపై అక్కడి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రజినీ కాంత్ జైలర్, కమలహాసన్ విక్రమ్ చిత్రాలతో సత్తా చాటారన్నారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు కూడా ఎన్నో గొప్ప చిత్రాలు చేస్తున్నారని విజయ్ ప్రశంసించారు. ఇకపోతే, ఖుషి చిత్రం ప్రతి ఒక్కరినీ ఆనందపరుస్తుందన్నారు. సీనియర్ నటుడు నాజర్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.