విశాల్ కంటికి గాయాలు
నటుడు విశాల్ కంటికి గాయాలయ్యాయి. ఆయన కొత్తగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం `నాట్ ఎ కామన్‌మేన్`. విశాల్ కిది 31వ సినిమా. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. అక్కడ చిన్నపాటి హోటల్‌లో రౌడీలతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విశాల్ రౌడీలను ఫైట్ చేస్తుండగానే వెనక నుంచి ఓ రౌడీ వచ్చి తల వెనుక షోడా బాటిల్‌తో కొడతాడు. గాజు ముక్కలుగా అయిపోతుంది. అందుకు రియాక్షన్ బాగా ఇచ్చాడు విశాల్. ఆ తర్వాత ఆ వ్యక్తే సగం పగిలిన బాటిల్ వెనక్కు వెళుతూ విసిరేస్తాడు. అది కరెక్ట్‌గా వచ్చి విశాల్ ఎడమ కంటిపై తగిలింది. దాంతో హఠాత్ పరిణామాన్ని ఖంగు తిన్న విశాల్, అక్కడి రౌడీలు కంగారు పడ్డారు. యాక్షన్ దర్శకుడు రవివర్మ కట్ చెప్పాడు. కాసేపు బ్రేక్ ఇచ్చారు. కంటిలో గాజు సులుసులు పడకుండా తగు జాగ్రత్తలతో వాటిని పిచికారీ చేశారు. వెంటనే అందుబాటులో వున్న డాక్టర్ కూడా విశాల్‌ను పరీక్షించారు.
ఇలా యాక్షన్ సన్నివేశాల్లో హీరోకు విలన్‌లకూ కూడా దెబ్బలు తగలడం మామూలే. అందుకే కొన్ని రిస్క్ షాట్‌లను డూప్‌లతో తీయిస్తారు. అయితే ఈ ఘటన అనంతరం విశాల్ మానవతా దృక్పథంతో రవివర్మ యాక్షన్ ఆధ్వర్యంలో జరిగిన ఆ రౌడీ ఫైటర్‌ను నీదేమీ తప్పులేదంటూ, అనుకోకుండా జరిగిందని కూల్‌గా చెప్పడం విశేషం. ఈ యాక్షన్ సీన్ విశాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో డింపల్ హయాతీ నాయికగా నటిస్తోంది. రమణ మరో పాత్ర పోషిస్తున్నాడు. తు.ప.శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు.