గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (20:19 IST)

సినీ కార్మికులకు సీసీసీ ద్వారా నిత్యావసర వస్తువులు ఇచ్చేందుకు రెడీ- త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌

క‌రోనా మ‌హ‌మ్మారీ ఇత‌ర రంగాల్లానే.. టాలీవుడ్‌ని, సినీ కార్మికుల్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. వినోద‌ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ప్ర‌భావం అసాధార‌ణంగా ఉంద‌ని తాజా ప‌రిస్థితులు చెబుతున్నాయి. ఉపాధి కోల్పోయిన సినీకార్మికులు నిత్యావ‌స‌రాల‌కు సైతం ఇబ్బంది ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే ఇండ‌స్ట్రీ పెద్ద‌లు దీనిపై స్పందించి మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం (సీసీసీ)ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ సేవా సంస్థ ద్వారా సినీకార్మికుల‌కు త‌క్ష‌ణ సాయం అందించనున్నారు.
 
హైద‌రాబాద్‌లో జ‌రిగిన సీసీసీ కార్య‌క్ర‌మల గురించి ప్రముఖ దర్శక నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ-``కార్మికుల‌కు మంచి జ‌ర‌గాల‌ని చిరంజీవి గారు వెంట‌నే స్పందించి సేవ‌కు ముందుకొచ్చారు. వెంట‌నే సీసీసీ ట్ర‌స్ట్‌ని ప్రారంభించారు. దీనికి స్పందించిన సెల‌బ్రిటీలంతా చారిటీకి విరాళాలు పంపారు. బ్యాంకుల‌కు సెల‌వుల కారణంగా విరాళాలు ప్రకటించిన మనీ ట్రాన్స్ఫర్ ఈరోజు నుంచి వస్తున్నాయి. 
 
నిత్యావసర సరుకులు అన్ని పూర్తిగా సిద్ధం చేసుకుని మేమే కార్మికుల ఇంటింటికి వెళ్లి సాయం అందిస్తాం. అలాగే అపోలో ఫార్మ‌సీ నుంచి రూ.500-1000 వ‌ర‌కూ ప్రిస్కిప్షన్ ఉంటే మందులు పంపిస్తారు. ఆ సాయానికి వారికి ధ‌న్య‌వాదాలు. ఇక సీసీసీ టెంప‌ర‌రీగా కాకుండా ప‌ర్మినెంట్‌గా ఇలాంటి స‌మ‌యాల్లో సాయం అందించ‌నుంది. సీసీసీ త‌ర‌పున కార్మికుల‌కు సాయం చేయాల‌నీ భ‌విష్య‌త్ లోనూ సీసీసీ చారిటీ కొన‌సాగించేలా ప్ర‌ణాళిక రూపొందిస్తున్నాం. ఇక ట్ర‌స్ట్ నుంచి వ‌చ్చే డ‌బ్బుల్ని అవ‌స‌రార్థుల‌కు వెంట‌నే అంద‌జేస్తున్నాం. ఎన్.శంక‌ర్ సార‌థ్యంలో ఇప్ప‌టికే జాబితాలు సిద్ధ‌మ‌వుతున్నాయి`` అన్నారు.
 
అలాగే ద‌ర్శ‌క‌సంఘం అధ్య‌క్షుడు ఎన్.శంక‌ర్ మాట్లాడుతూ-``మ‌రో మూడు రోజుల్లోనే నిత్యావ‌స‌రాలు రెడీ అయిపోతాయి. ముందుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్స్ వారు తెలిపిన నిరుపేద సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అవసరం ఉన్న కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. 
 
ఎవరికైతే నిత్యావసర సరుకులు అవసరమనుకున్న కార్మికులంద‌రూ వెంట‌నే సంప్ర‌దించండి. వివ‌రాల్ని అందిస్తే వారికి వెంట‌నే స‌రుకులు అందిస్తాం. ఇది ఆలస్యం కాకూడదని ఈనెల ఐదో తారీకు ఆదివారం నుంచి డోర్ డెలివరీ స్టార్ట్ అవుతుంది. అలాగే నిత్యవసర మందులు కోసం ఇబ్బంది పడుతున్న వారి కోసం మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ మరియు ఉపాసన గారితో మాట్లాడి అపోలో ద్వారా మీ ఇంటికి మెడిసిన్స్ పంపించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 
 
సభ్యులకు 500 నుంచి 1000 రూపాయలు విలువ చేసే మందులు ఇవ్వడానికి కూడా అపోలో వారు ఆమోదించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో మీరు ఏ అసోసియేషన్స్‌లో ఉన్నారో ఆ నాయకుడికి మీ ఇబ్బందులను తెలియజేస్తే వారి ద్వారా మీకు మీ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. నిజంగా ఎవరైతే బాగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు వారికి మీ అసోసియేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇది నిరంత‌ర సేవ‌. అవసరమైన అంద‌రికీ ఈ సేవ‌లు అందుతాయి. నిత్యావ‌స‌రాలు కావాల‌నుకునేవారికి నేరుగా డోర్ డెలివ‌రీ అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాం. మీరు ఇండ్ల‌లోనే ఉండి క‌రోనాపై పోరాడండి`` అని అన్నారు.