శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (18:37 IST)

ఎవడు పడితే వాడు వచ్చి నరికేసేందుకు నేను గొర్రెను కాదు.. యాష్ (video)

''కేజీఎఫ్'' సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుని రాత్రికి రాత్రే.. క్రేజీ హీరోగా మారిపోయిన యాష్‌కు ప్రస్తుతం ప్రమాదం పొంచివుందని కన్నడ మీడియా కోడై కూస్తోంది. కేజీఎఫ్ హీరోకు వచ్చిన పేరును చూసి తట్టుకోలేక.. ద్వేషంతో అతన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని.. అందుకు భారీ క్రిమినల్స్‌కి సుపారీ ఇచ్చారని కర్ణాటకలో జోరుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
 
అయితే ఈ వార్తలపై యాష్ స్పందించాడు. ఈ వార్తల్లో నిజం లేదని ఈ రాక్ స్టార్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ విషయంలో మీడియా ఓవరాక్షన్ చేస్తుందని చెప్పాడు. ఇలాంటి ఆధారాల్లేని వార్తలు ప్రచారం చేయొద్దని.. ఈ వార్తలను చూసి కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారని చెప్పాడు. తనపై ఎవ్వరికీ ద్వేషం లేదని.. సెన్సేషనల్ కోసం మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేయవద్దని యాష్ హితవు పలికాడు. 
 
ఇలాంటి వార్తల కారణంగా తనకు ఆగకుండా ఫోన్లు వస్తున్నాయన్నాడు. ఎవరైనా ఓ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ అయితే తన ప్రాణాలకు ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మున్ముందు వీటి వల్ల ఎటువంటి ఘటనలు జరుగుతాయోనని భయంగా ఉందన్నాడు. అసలు తనకు ప్రాణహాని ఉందన్న వార్తలను మీడియాకు ఎవరు చేరవేస్తున్నారో తనకు తెలియడం లేదన్నారు.
 
ఎవడు పడితే వాడొచ్చి నరికేయడానికి తాను గొర్రెను కానని యశ్ తేల్చి చెప్పాడు. ఇంకా తనపై జరుగుతున్న ప్రచారంపై సీసీబీ అడిషనల్ కమీషనర్ అలోక్ కుమార్‌తో పాటు కర్ణాటక హోమ్ మినిస్టర్ ఎంబీ పాటిల్‌ని కూడా కలిసి చర్చించినట్లు తెలిపాడు. ఇంకా తనను చంపేస్తామని ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని యాష్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.