రాక్‌స్టార్ యష్ నటన సూపర్బ్ .. 'కేజీఎఫ్'పై కేటీఆర్ ప్రశంసలు
తెలంగాణ మాజీ మంత్రి, ప్రస్తుత తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచుగా సినిమాలు చూస్తుంటారు. తనకు వీలు చిక్కినపుడల్లా సినిమాలు చూసే ఆయన, వాటి గురించి ట్విటర్ ద్వారా స్పందిస్తుంటారు. కాగా ఇటీవల ఎన్నికలు.. పదవుల పంపకాలతో బిజీ అయిపోయి సినిమాలు చూడలేకపోయిన కేటీఆర్ తాజాగా ఓ సినిమాని గురించి ట్వీట్ చేయడం జరిగింది.
దక్షిణాది సినిమాలలో 'బాహుబలి' తర్వాత ఆ స్థాయి భారీ బడ్జెట్‌తో నిర్మితమై ఘన విజయం సాధించిన చిత్రం 'కేజీఎఫ్'. కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన ఈ సినిమా దక్షిణాది భాషలన్నింటిలోనూ విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆ సినిమాని చూసిన కేటీఆర్ చిత్రబృందాన్ని ట్విటర్ ద్వారా ప్రశంసిస్తూ, "కొద్దిగా ఆలస్యంగానే అయినా ఎట్టకేలకు 'కేజీఎఫ్' చూసాను. సినిమా అద్భుతంగా ఉంది. సాంకేతికంగా, కథాపరంగా చాలా బాగుంది. పట్టుసడలని స్క్రీన్‌ప్లేతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. స్క్రీన్‌ఫై రాక్‌స్టార్ యష్ నటన అదిరిపోయింది" అంటూ ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురిపించేసారు.