సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (11:58 IST)

మోహన్‌బాబుకి లీగల్ నోటీసు పంపిన వైవీఎస్ చౌదరి

టాలీవుడ్‌లో సీనియర్ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్‌బాబుకు దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి తరపు న్యాయవాదులు లీగల్ నోటీసులు పంపారు. ఈ వివరాలలోకి వెళ్తే... ‘సలీం’ సినిమా సమయంలో తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిన సందర్భంగా వేసిన కేసులో కోర్టు తీర్పు వైవీఎస్ చౌదరికి అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే.
 
ఈ తీర్పు అనంతరం మోహన్‌బాబు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడనేది వైవీఎస్ చౌదరి తాజాగా చేస్తున్న ఆరోపణ. ‘సలీమ్’ చిత్ర నిర్మాణ సమయంలోనే మోహన్‌బాబు నివసిస్తున్న జల్‌పల్లి గ్రామంలో ఆయన ఇంటిని ఆనుకుని ఉన్న అర ఎకరం స్థలాన్ని తాను కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చిన వైవీఎస్ చౌదరి... కోర్టు తీర్పు అనంతరం తనను, తన మనుషుల్ని తాను కొనుగోలు చేసిన సదరు స్థలంలోకి రానీయకుండా మోహన్‌బాబు, ఆయన మనుషులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 
 
కష్టార్జితంతో తాను కొనుక్కున్న ఇంటి స్థలం విషయంలో ఆయన సమస్యలు సృష్టిస్తుండడంతో, ఇన్నేళ్లగా జరిగిన, జరుగుతున్న ఉదంతాలపై శాశ్వత పరిష్కారం కోసం న్యాయ నిపుణులను ఆశ్రయించినట్లు వైవీఎస్ తెలిపారు. పూర్తి వివరాలకై తమ న్యాయవాదులు ఆయనకు పంపిన లీగల్‌ నోటీసును ఈ లేఖతో జత చేస్తున్నానని పేర్కొన్న వైవీఎస్ చౌదరి ఓ లేఖను విడుదల చేసారు.