వైవిఎస్ చౌదరి వద్దన్నా బ్యాంకులో వేసి బౌన్స్ చేశారు... అక్కడ తేల్చుకుంటాం: మోహన్ బాబు
ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెషల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్షను ఖరారు చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ ``2009లో `సలీమ్` సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వైవిఎస్ చౌదరికి చెల్లించేశాం.
మా బ్యానర్‌లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40 లక్షల చెక్ ఇచ్చాం. `సలీమ్` అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. వైవిఎస్ చౌదరితో తదుపరి చేయాల్సిన సినిమాను వద్దనుకున్నాం. సినిమా చేయడం లేదని వైవిఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయవద్దని కూడా చెప్పాం. అయినా కూడా కావాలనే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ను బౌన్స్ చేశారు.
నాపై చెక్ బౌన్స్ కేసుని వేసి కోర్టును తప్పు దోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుని మేం సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని చానెల్స్‌లో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దు`` అన్నారు.